చెడు గెలిచినా నిలవదు
ఈ దసరాకి పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తానని రాజమహేంద్రవరం మహానాడులో ప్రకటించానని చంద్రబాబు తెలిపారు. అదే రాజమహేంద్రవరం జైలులో నన్ను ఖైదు చేశారన్నారు. త్వరలో బయటకొచ్చి పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తానన్నారు. నా ప్రజల కోసం, వారి పిల్లల భవిష్యత్తు కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానన్నారు. ఎప్పుడూ బయటకు రాని ఎన్టీఆర్ బిడ్డ, నా భార్య భువనేశ్వరిని నేను అందుబాటులో లేని ఈ కష్టకాలంలో ప్రజల్లోకి వెళ్లి నా తరఫున పోరాడాలని నేను కోరానని, అందుకు ఆమె అంగీకరించారన్నారు. తన అక్రమ అరెస్టుతో తల్లడిల్లి మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించాలని, ‘నిజం గెలవాలి’ అంటూ మీ ముందుకు వస్తున్నారని చంద్రబాబు లేఖలో తెలిపారు. జనమే నా బలం, జనమే నా ధైర్యం అన్న చంద్రబాబు… దేశవిదేశాలలో నా కోసం రోడ్డెక్కిన ప్రజలు వివిధ రూపాల్లో మద్దతు తెలుపుతున్నారన్నారు. న్యాయం ఆలస్యం అవ్వొచ్చునేమో కానీ, అంతిమంగా గెలిచేది మాత్రం న్యాయమే అన్నారు. మీ అభిమానం, ఆశీస్సులతో త్వరలోనే బయటకి వస్తానని చంద్రబాబు తెలిపారు. అంతవరకూ వైసీపీ పాలనపై శాంతియుత పోరాటం కొనసాగించాలని కోరారు. చెడు గెలిచినా నిలవదు, మంచి తాత్కాలికంగా ఓడినట్లు కనిపించినా కాలపరీక్షలో గెలిచి తీరుతుందన్నారు. త్వరలోనే చెడుపై మంచి విజయం సాధిస్తుందని చంద్రబాబు అన్నారు.