ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన వైసీపీ.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. దీంతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. అదేనండోయ్.. అధికారం ఉంటే ఒకలా.. లేకుంటే మరోలా అంటారే అచ్చం అలాగే ఇప్పుడు మాజీ సీఎం ప్రవర్తన ఉంది. ఒకానొక సందర్భంలో అసెంబ్లీ వేదికగా టీడీపీకి ఉన్న 23 ఎమ్మెల్యేలను హేళన చేస్తూ.. మేం డోర్లు తెరిస్తే, ఆరేడు మందిని చేర్చుకుంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుందని జగన్ చేసిన కామెంట్స్ సరిగ్గా ఆయనకే సెట్ అయ్యాయి. ఎంతలా అంటే.. బయటికి చెప్పుకోలేక, నోరు మెదపలేక మదనపడుతున్న పరిస్థితి.
ఎందుకో ఇలా..?
ఒక పార్టీ అధినేత, అందులోనూ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైఎస్ జగన్ రెడ్డికి ప్రతిపక్ష హోదానే ఎందుకు..? ప్రజా సమస్యలు మాట్లాడటానికి ఆ పదవే ఉండాలా..? ఏంటి..? లేకున్నా ప్రజల కోసం కొట్లాడటంలో వచ్చే ఆ కిక్కే వేరు కదా. ఎందుకంటే ఇలా జీరోతో మొదలవ్వడం వైసీపీకి, ముఖ్యంగా జగన్ రెడ్డికి అస్సలు కొత్తేమీ కాదు. అలాంటిది ప్రతిపక్ష హోదా ఇవ్వండి..? అని దేహి అని అడుక్కోవడం ఏంటి..? ఇలా అబాసుపాలు అవ్వడం తప్ప ఒరిగింది ఏంటి..?. దీనికి తోడు అధికార కూటమిలో చోటా మోటా లీడర్లు మొదలుకుని.. మంత్రులు వరకూ నోటికి పని చెబుతున్న పరిస్థితి. అసలు ఇంత చెత్త సలహా జగన్ రెడ్డికి ఇచ్చిన ఆ పెద్ద మనిషికి దండ వేసి దండం పెట్టాల్సిందే..!
ఛాన్స్ దొరికినట్టే!
వాస్తవానికి.. వైఎస్ జగన్ అసెంబ్లీ వెళితే ఎలా ఉంటుందనేది మొన్న సమావేశాల్లో ప్రత్యక్షంగా మనందరం చూశాం. అసెంబ్లీ బయట, లోపల ఎంతలా ర్యాగింగ్.. కామెంటరీ చేశారో..! జస్ట్ ఇది టీజర్ మాత్రమే.. ఇంకా ట్రైలర్, సినిమా చాలానే ఉంది. రేపొద్దున్న ఇంతకు మించి రన్నింగ్ కామెంటరీ చేయరని..? పదే.. పదే విమర్శలు, కౌంటర్లు ఉండవు అనడానికి లేదు. తప్పకుండా డోస్ పెంచి హడావుడి చేస్తుంది కూటమి. అందుకే.. ఇవన్నీ అసెంబ్లీకి ఎప్పటికీ రాకుండా తప్పించుకోవాలని చేస్తున్న ముందస్తుగా ఇలా చేస్తున్నారా..? అనేది కూడా ఆయనకే ఎరుక. ఇప్పటికే ఈ కామెంట్స్ పలువురు కూటమి నేతలు తెగ హడావుడి చేస్తున్నారు. అందుకే.. అసెంబ్లీలోకి ఇప్పట్లో వెళ్ళడం అయ్యే పని ఐతే కాదు.! ఎలాగో స్పీకర్ అయ్యన్న, పగ బట్టిన ఎమ్మెల్యే రఘురామ ఇలా ఒకరా.. ఇద్దరా..? లెక్కలేనంత మంది ఉన్నారు. సో.. దీన్ని సాకుగా చూపించి ఓదార్పు యాత్ర 2.0 కోసం రంగం సిద్ధం చేస్తున్నారు అన్నది తాజాగా నడుస్తున్న హడావుడి. ఇక చివరిగా.. జగన్ వన్ మ్యాన్ అని.. ఒకే ఒక్కడు అంటూ నాడు తెగ ఆకాశానికి ఎత్తున అభిమానులు, కార్యకర్తలు చెబుతున్న మాట. ఏం జరుగుతుందో చూడాలి మరి.