ధర్మాన పొలిటికల్ రిటైర్మెంట్? Great Andhra


శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నేత మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పొలిటికల్ రిటైర్మెంట్ ని త్వరలో ప్రకటించనున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. 1981 నుంచి రాజకీయాల్లో ఉన్న ధర్మానది రాజకీయంగా 43ఏళ్ళ సుదీర్ఘ ప్రస్తానం. తొలుత నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ధర్మాన ఆ తరువాత కోట్ల విజయభాస్కరరెడ్డి, వైఎస్సార్, రోశయ్య, ఎన్ కిరణ్ కుమార్ రెడ్డిల వద్ద ఎన్నో కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

విభజన తరువాత వైసీపీ వైపు వచ్చిన ఆయన జగన్ ప్రభుత్వంలో రెండేళ్ళ పాటు ప్రధానమైన రెవిన్యూ శాఖను చూశారు. సబ్జెక్ట్ మీద మంచి పట్టు ఉన్న ధర్మాన వ్యక్తిగత విమర్శలకు దూరం. ఆయన పొలిటికల్ ఫిలాసఫీ కూడా కాస్తా భిన్నంగా ఉంటుంది.

ఆయన 2024 ఎన్నికల్లో పోటీ చేయకుండా 2019 ఎన్నికలలో విజయాన్నే తీపి గురుతుగా ఉంచుకుని ఘనంగా రాజకీయ విరమణ చేద్దాం అనుకున్నారు. అయితే జగన్ ఆయనను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయమని కోరారు. గెలుస్తామని అనుకున్న చోట ఓటమి వరించింది. అది కూడా 52 వేల భారీ ఓట్ల తేడాతో పరాజయం పాలు కావడం ధర్మానకు తట్టుకోలేని విధంగా చేసింది అని అంటున్నారు.

దాంతో ఆయన గత కొంతకాలంగా మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. ఆయన రాజకీయాల నుంచి ఇక తప్పుకోవడం మంచిదని ఒక నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఆ విషయాన్ని జగన్ ని స్వయంగా కలసి చెప్పాలని ఆగారట. తొందరలో తాడేపల్లి వెళ్ళి జగన్ కి తన సంచలన నిర్ణయాన్ని చెప్పి పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకుంటారు అని అంటున్నారు. అయితే ధర్మాన తప్పుకున్నా ఆయన కుమారుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు వైసీపీ నుంచి రాజకీయంగా వారసుడిగా వస్తారని అంటున్నారు.

ఆయన్ని తన అంతటి రాజకీయ నేతగా చేయాలనే ధర్మాన తపన అంటున్నారు. జగన్ కి అదే విషయం చెప్పి కుమారుడికి శ్రీకాకుళం అసెంబ్లీ సెగ్మెంట్ వైసీపీ ఇంచార్జిగా నియమించాలని కోరతారు అని ప్రచారం సాగుతోంది. గత అయిదేళ్ళుగా తండ్రితో పాటు రామ్ మనోహర్ నాయుడు జనంలో ఉంటూ వచ్చారు. 2024 టికెట్ కోసం ఆయన ప్రయత్నించారు కూడా. జగన్ ఈ విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇస్తే సీనియర్ ధర్మాన తెర వెనక్కు వెళ్ళి జూనియర్ ధర్మాన తెర ముందుకు వస్తారని అంటున్నారు.



Source link

Leave a Comment