సినిమా పేరు: ధీర
తారాగణం: లక్ష్ చదలవాడ, సోనియా బన్సాల్, నేహా పఠాన్, హిమజ, భరణి తదితరులు
సంగీతం: సాయి కార్తీక్
డీఓపీ: కన్నా
ఎడిటర్: వినయ్ రామస్వామి
దర్శకత్వం: విక్రాంత్ శ్రీనివాస్
నిర్మాత: చదలవాడ పద్మావతి
బ్యానర్: శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్
విడుదల తేదీ: ఫిబ్రవరి 2, 2024
‘ధీర’ సినిమాతో లక్ష్ చదలవాడ ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘వలయం’, ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన లక్ష్.. ఇప్పుడు మాస్ యాక్షన్ మూవీతో వచ్చాడు. టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి ఈ మూవీ ఆడియెన్స్ ని ఏ మేరకు ఆకట్టుకుందో ఓ సారి చూద్దాం.
కథ:
వైజాగ్‌లో రణధీర(లక్ష్ చదలవాడ) డబ్బే లక్ష్యంగా బతుకుతాడు. డబ్బు కోసం ఏమైనా చేసేందుకు రెడీ అవుతాడు. అలాంటి రణధీరకు ఓ మిషన్ వస్తుంది. కోమాలో ఉన్న రాజ్ గురుని వైజాగ్ నుంచి హైద్రాబాద్‌కు తీసుకెళ్లే కాంట్రాక్ట్‌ను తీసుకుంటాడు రణధీర. అంబులెన్స్‌లో రణధీర వెళ్తుంటాడు. డాక్టర్ అమృత (నేహా పఠాన్) సైతం రణధీరతో వెళ్తుంది. మరో డాక్టర్ కూడా వారి వెంట వెళ్తాడు. అయితే ఈ అంబులెన్స్ మీద ఓ ముఠా దాడి చేస్తుంది. హైద్రాబాద్‌కు అంబులెన్స్ చేరకుండా అడ్డు పడుతుంటుంది. ఏపీకి చెందిన రాజకీయ నాయకురాలు హంసలేఖ దేవి (హిమజ) ఓ పాపను ప్రాణాలతో తీసుకురావాలంటూ పోలీస్ ఆఫీసర్ (భరణి)కి చెబుతుంది. అసలు కోమాలో ఉన్న రాజ్ గురు ఎవరు? అతని గతం ఏంటి? ఈ పాప ఎవరు? ఈ కథతో రణధీరకు ఉన్న లింక్ ఏంటి? చివరకు రణధీర ఏం చేశాడు? అన్నది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ:
రాజకీయ నేపథ్యంలో సాగే ఈ కథలో ఊహించని ట్విస్టులున్నాయి. డబ్బుకి ఆశపడి హీరో ఒక కాంట్రాక్టు ఉండటం, దాని వెనుక పెద్ద తలకాయలు ఉండటం ఆసక్తికరంగా ఉంది. రెండు డిఫరెంట్ లవ్‌స్టోరీలు, భారీ యాక్షన్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలను ఈ సినిమాలో పొందుపరిచారు. అయితే దర్శకుడు పేపర్‌పై బలంగా రాసుకున్న స్టోరీని.. మరీ ఎఫెక్టివ్‌గా, ప్రేక్షకుడు సీటు అంచున కూర్చుని చూసేలా చేయడంలో అంతగా సక్సెస్ కాలేదనిపిస్తుంది. హీరో ఎంట్రీ నుంచి క్లైమాక్స్ వరకు చాలా సన్నివేశాలు గత సినిమాలను గుర్తుచేస్తాయి. రాజ్‌గురు స్టోరీ ఏంటనేది మాత్రం చివరి వరకు ప్రేక్షకుడు పసిగట్టకుండా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజ్‌గురుని హైదరాబాద్‌కు తరలించేందుకు డాక్టర్లు ప్రయత్నించడం.. మరోవైపు హంసలేఖ ఫోన్ ద్వారా వైద్యులకు సూచనలు ఇవ్వడం..ఇలా చాలా ఆసక్తికరంగా కథ ప్రారంభం అవుతుంది. లక్ష్ ఎంట్రీ సీన్ కూడా అదిరిపోయింది. మీనాక్షితో రణ్‌ధీర్ లవ్‌స్టోరీ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. హీరో లవ్‌స్టోరీలోని ట్విస్ట్ రివీల్ అయ్యాక మరింత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది.
ఓ భారీ యాక్షన్, రొమాంటిక్ సీన్స్, ఇంట్రెస్టింగ్ లవ్‌స్టోరీతో ఫస్టాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండాఫ్ లో ఒక్కో ట్విస్టుని రివీల్ చేస్తూ ఆసక్తికరంగా కథనాన్ని నడించాడు దర్శకుడు. పాప ఎవరు? ఆమె కోసం వెతుకుతున్నదెవరు అనేది తెలుసుకోవడం కోసం హీరో చేసే ప్రయత్నం బాగుంది. పతాక సన్నివేశాలు మెప్పించాయి.
సాంకేతికంగానూ ఈ చిత్రం బాగుంది. పాటలు, నేపథ్య సంగీతంలో మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ తన మార్క్ చూపించాడు. కన్నా కెమెరా పనితనం బాగుంది. విజువల్స్ ఎంతో రిచ్‌గా ఉన్నాయి. ఎడిటర్ వినయ్ రామస్వామి ఉన్నంతలో సినిమాని నీట్ గా ప్రజెంట్ చేశాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
నటీనటులు:
రణధీర పాత్రలో లక్ష్ చక్కగా రాణించాడు. ఎమోషనల్, రొమాంటిక్ ఇలా అన్ని సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టేశాడు. అతని కటౌట్ కమర్షియల్ హీరోకి తగ్గట్టుగా ఉంది. హీరోయిన్లు సోనియా, నేహా గ్లామర్ పరంగా ఆకట్టుకున్నారు. హిమజ, భరణి శంకర్, విలన్ పాత్రలు బాగానే ఉన్నాయి.
ఫైనల్ గా..
దర్శకుడు తాను పేపర్ మీద రాసుకున్న బలమైన స్క్రిప్ట్ ని, తెరమీదకు తీసుకురావడంలో కాస్త తడబడినప్పటికీ.. ప్రయత్నం మాత్రం మెచ్చుకోదగినది. రాజకీయ నేపథ్యంలో యాక్షన్, రొమాన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపొందించిన ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు.
రేటింగ్: 2.5/5