దిశ, ఫీచర్స్ : శతాబ్దాలుగా మహిళలు తమ అందాన్ని పెంచుకోవడానికి వివిధ రకాల ఆభరణాలను ధరిస్తున్నారు. నేటికీ కొనసాగుతున్న ఈ ఆభరణాల పట్ల మహిళలు ఎంతగానో ఆకర్షితులవుతున్నారు. స్త్రీలు తమ అందాన్ని పెంపొందించుకోవడానికి ధరించే ఆభరణాలు ధార్మికంగా, శాస్త్రీయంగా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. మరి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కంకణాలు..
కంకణాలు అలంకారంలో చాలా ప్రత్యేకమైనవి. బ్రైడల్ మేకప్ లో బ్యాంగిల్స్ లేకుండా అలంకారం అసంపూర్ణం అవుతుంది. ఇక శాస్త్రాల ప్రకారం స్త్రీలు ధరించే గాజులను అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. గాజులు చంద్రునికి సంబంధించినవిగా పరిగణిస్తారు. అందుకే బంగారు గాజులను ధరించడం వలన శరీరంలో రక్త ప్రసరణను నియంత్రిస్తాయని, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
చెవిపోగులు, చెవిదిద్దులు..
మహిళలు మాత్రామే కాదు ఈ మధ్య కాలంలో పురుషులు కూడా చెవులకి పోగులు వేసుకుంటున్నారు. అయితే చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకు ప్రతి ఒక మహిళ చెవిపోగులు ధరించి వారి అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంటారు. వివాహానంతరం స్త్రీలు తమ భర్త, అత్తమామలను చెడ్డ మాటలు మాట్లాడకుండా, వారు మాట్లాడే చెడు మాటలు వినకుండా ఉండాలని చెవి దిద్దులు పెడతారని భావిస్తారు. ఇక శాస్త్రీయ దృక్కోణంలో చెవి బయటి భాగంలో చాలా ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉన్నాయని చెబుతారు. ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ల పై చెవిపోగులు పెట్టడం వలన మూత్రపిండాలని, మూత్రాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతున్నారు నిపుణులు. అలాగే స్త్రీల పునరుత్పత్తి చక్రం మెరుగుపరచడంలో సహాయపడుతుందట. బంగారు చెవిపోగులు ధరించడం వలన ఉద్దీపనలకు హైపర్యాక్టివిటీ, చురుకుదనం కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు.
ముక్కుపుడక..
స్త్రీలు వివాహం, ఇతర పండుగల సందర్భంలో ముక్కుపుకడను ధరిస్తారు. అలాగే ప్రని నిత్య ముక్కుపుడకను ధరించే మహిళలు కూడా ఉన్నారు. వివాహిత స్త్రీలు ముక్కుపుడక పెట్టుకుంటే భర్త ఆరోగ్యం బాగుంటుందని, ఇల్లు సుభిక్షంగా ఉంటుందని నమ్ముతారు. శాస్త్రీయ దృక్కోణంలో ముక్కుపుడక ధరిస్తే స్త్రీ గర్భాశయానికి మంచిదని చెబుతారు. బంగారు ముక్కుపుడక ధరించడం వల్ల గర్భధారణ, డెలివరీ సమయంలో సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు.
మంగళసూత్రం, నెక్లెస్..
మంగళసూత్రం భార్యాభర్తల మధ్య ప్రేమకు, స్త్రీ అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. మంగళసూత్రం లేదా నెక్లెస్ మెడలో ధరించినప్పుడు అనుకూల శక్తిని తన వైపుకు ఆకర్షిస్తుంది. అంతేకాదు మనస్సు, హృదయాన్ని ప్రశాంతంగా ఉంచుతుందని నమ్ముతారు. శాస్త్రీయ దృక్కోణంలో మెడ చుట్టూ అనేక నరాల మార్గాలు ఉన్నాయని చెబుతారు. మెడలో బంగారు హారం వేసుకున్నప్పుడు వాటి రాపిడి కారణంగా శరీరంలో రక్త ప్రసరణ నియంత్రించడంలో సహాయపడుతుందని చెబుతారు.
మెట్టెలు..
వివాహిత మహిళలు కాలికి మెట్టెలు ధరించడం ఆనవాయితీ. మెట్టెలు ధరించడం వల్ల ఇల్లు సుభిక్షంగా ఉంటుందని చెబుతారు. శాస్త్రీయ దృక్కోణంలో రెండవ బొటనవేలులో ఉన్న సిరలు గర్భాశయం నుండి గుండెకు వెళ్తాయి. మెట్టెలు ధరించడం వల్ల పునరుత్పత్తి చక్రం మెరుగుపడుతుంది. మహిళల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
నుదుట సింధూరం..
వివాహిత మహిళలు నుదుట సింధూరం ధరించడం వలన ఆ స్త్రీ ఎల్లప్పుడూ తన జీవితంలో సరైన, సరళమైన మార్గాన్ని అనుసరిస్తుందని నమ్ముతారు. అలాగే ఎటువంటి పక్షపాతం లేకుండా సరైన నిర్ణయాలు తీసుకుంటారని చెబుతారు. అలాగే తన సౌభాగ్యం కూడా నూరేళ్లు ఉంటుందని నమ్ముతారు. ఇక శాస్త్రీయ దృక్కోణంలో నుదుట సింధూరం ధరించడం వల్ల మనస్సు ప్రశాంతంగా, ఏకాగ్రతతో పాటు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది.