తమిళ చిత్ర పరిశ్రమలో ఓ నటుడి మరణం అందర్నీ కలచివేస్తోంది. ఓ సినిమా షూటింగ్‌లో గాయపడిన ప్రముఖ నటుడు బాబు 30 ఏళ్ళుగా మంచానికే పరిమితమయ్యాడు. అతని ఆరోగ్యం క్షీణించడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆరోగ్యం మరింత క్షీణించి మంగళవారం కన్నుమూసారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన బాబు భారతీరాజా దర్శకత్వంలోనే 1990లో వచ్చిన ‘ఎన్ ఉయిర్ తోజన్’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. నటుడిగా బాబుకి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత వరసగా సినిమాలు వచ్చాయి. ప్రేక్షకులు మెచ్చే సినిమాల్లో నటించి వారికి బాగా దగ్గరయ్యాడు. హీరోగా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో ‘మనసారా పరిహితంగానే’ అనే చిత్రానికి సంబంధించి ఓ ఫైట్ సీన్ చిత్రీకరణ జరుగుతోంది. ఓ బిల్డింగ్ పై నుంచి దూకే సన్నివేశంలో డూప్ లేకుండా తనే స్వయంగా చేయాలని భవనం పై నుంచి దూకాడు. దాంతో అదుపు తప్పి గాయపడ్డాడు. వెన్నెముకకు గాయమైంది. శస్త్ర చికిత్స చేయించినా ఫలితం లేదు. దాంతో 30 ఏళ్ళపాటు కోమాలో ఉండిపోయాడు. బాబు మరణం పట్ల తమిళ సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు.