2019 ఎన్నికల్లో గెలిచాక ప్రజావేదిక కూల్చివేతలతో వైసీపీ ప్రభుత్వం మొదలవ్వగా.. నేడు కూటమి సర్కార్ ఏకంగా వైసీపీ కేంద్ర కార్యాలయన్నే కూల్చేసింది..! దీంతో ఏపీలో టీడీపీ కూటమి విధ్వంస పాలన మొదలైందని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్న పరిస్థితి. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని CRDA అధికారులు కూల్చివేశారు. శనివారం తెల్లారుజామున 5:30 గంటల సమయంలో మొదలైన కూల్చివేత.. 9 గంటల ప్రాంతంలో ముగిసింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రొక్లెయిన్లు, బుల్డోజర్లతో కూల్చివేతలు జరిగాయి. రెండో ఫ్లోర్ శ్లాబ్‌కు సిద్ధంగా ఉన్న భవనాన్ని కూల్చివేయడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏం జరిగింది..?
ఉండవల్లిలోని బోటు యార్డ్ స్థలంలో రెండు ఎకరాల భూమిని 90 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించడం మొదలు పెట్టారు. మొదటి ఫ్లోర్ పూర్తి అవ్వగా.. రెండో ఫ్లోర్ పనులు మొదలయ్యాయి. ఈ క్రమంలో తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సీఆర్డియే అధికారులు కూల్చేశారు. ఇలాంటి కూల్చివేతలు ఉంటాయని ముందుగానే వైసీపీ పసిగట్టుందేమో కానీ.. సీఆర్డీయే ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్‌చేస్తూ శుక్రవారం నాడు హైకోర్టును ఆశ్రయించింది. ఇందుకు స్పందించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం.. చట్టాన్ని మీరి వ్యవహరించ వద్దని ఆదేశించినది. ఈ మేరకు సీఆర్డీయే కమిషనర్‌కు హైకోర్టు ఆదేశాలను వైసీపీ న్యాయవాది తెలియజేశారు కూడా. ఐనా సరే.. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైసీపీ కార్యాలయ భవనాన్ని కూల్చివేయడం గమనార్హం. ఇది కోర్టు ధిక్కరణకు పాల్పదినట్టేనని.. హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు.
జగన్ ట్వీట్..!
వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కూల్చివేతపై అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైసీపీ తలొగ్గేది లేదు.. వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టిపోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నానని వైఎస్ జగన్ ట్వీట్ లో రాసుకొచ్చారు. దీనిపై వైసీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాలనను పక్కన పెట్టి..వైసీపీ ఆఫీసుని కూల్చి రాక్షసానందం పొందుతున్న విజనరీ? ఇది అసలు ప్రజాస్వామ్యవాదమా.. ఉగ్రవాదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. నాడు ప్రజావేదికను కూల్చడంతో ఇందుకు రివెంజ్ గా ఇలా టీడీపీ చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.