జీవితంలో ఏం చేయాలన్న విషయంలో తన ప్లాన్ లు తనకు వున్నాయని, అయితే ముందుగా చెబుతుంటే జరగడం లేదనే సెంటిమెంట్ తో చెప్పడం లేదని, వన్స్ అమలు చేసాక చెబుతా అని అన్నారు హీరో అల్లు శిరీష్.
బడ్డీ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడినపుడు, ఇద్దరు అన్నలు సినిమా రంగంలో సెటిల్ అయిపోయారు. మరి మీ సంగతేమిటి? సినిమాలు ట్రయ్ చేయడమేనా? ఫ్యామిలీకి వున్న బిజినెస్ ల్లో ఏదైనా టేకప్ చేస్తారా? అని అడిగితే శిరీష్ చెప్పిన సమాధానం ఇది. గతంలో ఇలా చేస్తా, అలా చేస్తా అని చెబితే అది జరగలేదని, అందుకే ఈసారి ముందుగా చెప్పాలనుకోవడం లేదని అన్నారు.
తన సర్కిల్ లో వున్న జనాలు చాలా మంది సినిమా టికెట్ రేట్ల గురించి చెప్పారని, అందుకే బడ్డీ సినిమా రేట్లు చాలా తగ్గించి అందరికీ అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ఇది ఓ చిన్న ప్రయత్నం అని సినిమా ఇండస్ట్రీ దీనిని ఫాలో అయితే మంచిదే అని అన్నారు. ఎవరో ఒకరు మొదలుపెట్టాలి కనుక తాను ముందు అడుగు వేసా అన్నారు. సినిమా క్లీన్ గా వుంటుందని, పిల్లలతో సహా అందరూ చూడవచ్చని అల్లు శిరీష్ అన్నారు. యు/ఎ సర్టిఫికెట్ వుందన్న అనుమానం అవసరం లేదన్నారు.
“బడ్డీ” సినిమా రిలీజ్ ముందు వేసిన షోస్ కు అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి, పిల్లలు, పెద్దలు అందరి దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ ఆడియెన్స్ కూడా మూవీని బాగా ఎంజాయ్ చేశారు. ఇది ఎక్స్ పెక్ట్ చేయలేదు. మేము ఏ ఏ సీన్స్ లో ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తారని ఎక్స్ పెక్ట్ చేశామో ఆ సీన్స్ వారికి బాగా నచ్చుతున్నాయి. ఈ సినిమాలో నేను సెకండ్ హీరో అనుకోవచ్చు. టెడ్డీ బేర్ ఫస్ట్ హీరో. తను చేసే యాక్షన్ సీన్స్ చాలా బాగుంటాయన్నారు శిరీష్.