Pawan Kalyan : మీడియా సమావేశాలు, టీవీ చర్చల్లో పాల్గొనే జనసేన ప్రతినిధులు రాజ్యాంగ విలువలకు కట్టుబడి పాలనాపరమైన విధివిధానాలు, ప్రజలకు ఉపయోగపడే అంశాల మీద మాత్రమే మాట్లాడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం పార్టీ అధికార ప్రతినిధులతో పవన్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ నిర్ధిష్ట అభిప్రాయాలను వారికి తెలియచేశారు. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “ఎవరైనా ఒక నాయకుడు ప్రభుత్వ పాలసీలకు ఆటంకం కలిగించినప్పుడు అతని విధానాలు, చేసిన తప్పుల గురించి బలంగా ప్రస్తావించండి. కులాలు, మతాలు గురించి మాట్లాడవలసినప్పుడు రాజ్యాంగానికి లోబడి మాత్రమే మాట్లాడాలి. అన్ని మతాలను ఒకేలా గౌరవించాలని, దేవాలయం లేదా చర్చి లేదా మసీదులపై దాడులు జరిగినప్పుడు ఒకేలా స్పందించాలి. ఒక మతం పట్ల ఉదాసీనంగా, ఒక మతం పట్ల నిర్లక్ష్యంగా, మరో మతాన్ని ఎక్కువగా చూడటం వంటి చర్యలకు పాల్పడే నాయకులను, పార్టీలను గట్టిగానే నిలదీయాలి” అన్నారు.