posted on Apr 23, 2024 10:24AM
ఇప్పట్లో సంపూర్ణ ఆరోగ్యం కలిగిన మనుషులు దాదాపు కనుమరుగయ్యారనే చెప్పాలి. ఎక్కడ చూసినా ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నవారే ఉంటున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా సరే.. కనీసం పోషకాహార లోపం, విటమిన్ల లోపం, రక్తహీనత వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారున్నారు. అయితే కొందరు రాత్రి సమయాలలో నిద్రపోయేటప్పుడు కాళ్లు లాగేస్తుంటాయి. ముఖ్యంగా కాలి లోపలి నరాలు మెలితిప్పినట్టు అనిపిస్తుంటాయి. ఇలా ఎందుకు అవుతుంది? వీటి వెనుక కారణాలేంటి? తెలుసుకుంటే..
చాలామంది రాత్రి నిద్రసమయాలలో కాళ్లు లాగేస్తన్నాయని, నిద్ర పట్టడం లేదని ఫిర్యాదు చేస్తుంటారు. నిద్రలోనూ, విశ్రాంతి సమయాల్లో నరాలు లాగినట్టు లేదా నరాలు ఉబ్బుతున్నట్టు కనిపించినా అవన్నీ శరీరంలో పోషకాహార లోపం వల్ల కలిగే ఇబ్బందులేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కొందరిలో నిద్రపోతున్నప్పుడు మాత్రమే కాకుండా లేస్తున్నప్పుడు, కూర్చునేటప్పుడు, వ్యాయామం చేస్తున్నప్పుడు కాళ్లలో సిరలు ఉబ్బినట్టు కనిపిస్తాయి. దీనికి కేవలం పోషకాహార లోపం మాత్రమే కారణం కాదు. శరీరంలో నీరు, కాల్షియం, సోడియం, పొటాషియం వంటి ఖనిజాలు లేకపోవడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది.
శరీరంలో వేలకొద్ది నరాలు ఉంటాయి. వీటిని సిరలు అని కూడా సంభోదిస్తారు. ఈ సిరలలో రక్తప్రవాహం సరిగా లేకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. సిరలలో రక్తప్రవాహం సరిగా లేకపోవడానికి ప్రధాన కారణం హిమోగ్లోబిన్ సరిగా లేకపోవడం. హిమోగ్లోబిన్ లోపం వల్ల కూడా ఇలా జరుగుతుంది.
చాలామందికి తెలియని మరొక ముఖ్య కారణం విటమిన్-సి లోపం. శరీరంలో హిమోగ్లోబిన్ తగినంత ఉండాలంటే ఐరన్ అవసరం. కానీ విటమిన్-సి లోపిస్తే శరీరం ఐరన్ ను గ్రహించలేగు. కాబట్టి విటమిన్-సి లోపం వల్ల ఐరన్ లోపం,హిమోగ్లోబిన్ తగినంత లేకపోవడం, రక్తహీనత, నరాల సమస్యలు ఒకదాని వెంట ఒకటి వస్తాయి. విటమిన్-సి లోపం వల్ల కూడా రాత్రి నిద్రపోతున్న సమయంలో నరాలు ఇబ్బంది పెడతాయి.
మద్యపానం తీసుకునే వారిలో నరాల సంబంధ సమస్యలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. మద్యపానం కూడా విటమిన్లు, ఐరన్ మొదలైనవి శరీరం గ్రహించకుండా చేస్తాయి.
*రూపశ్రీ.