దిశ, ఫీచర్స్ : మనుషులను వర్ణించాలన్నా, మనుషుల మధ్య తేడాను తెలపాలన్నా వారి రూపాన్ని, ఎత్తును మొదలైన వాటిని వర్ణిస్తారు. అలాగే మనుషుల మధ్య తేడాను గుర్తించడానికి మరొక మార్గం ఉంది. అది ఏంటంటే కళ్ళు. వాస్తవానికి, కొంతమందికి నల్ల కళ్ళు ఉంటాయి. మరి కొంతమందికి గోధుమ కళ్ళు ఉంటాయి. అలాగే కొంతమందికి నీలం కళ్ళు కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ నీలి కళ్లు వ్యక్తుల పై ఒక పరిశోధన జరిగింది. ఈ పరిశోధనలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చింది. ఈ పరిశోధన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
నిజానికి నీలికళ్లతో ఉన్న ప్రతీ వ్యక్తి ఒకే వ్యక్తి వారసుడనేది నిజమా లేక అపోహ మాత్రమేనా అనే విషయాలను గురించి ఓ నిపుణుడు వెల్లడించారు. ప్రపంచంలోని 70 – 80 శాతం మందికి గోధుమ కళ్ళు ఉన్నాయని అంచనా వేశారు. అయితే 8 -10 శాతం మందికి మాత్రమే నీలం కళ్ళు, 2 శాతం మందికి మాత్రమే ఆకుపచ్చ కళ్ళు ఉన్నాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తమాలజీ ప్రకారం, సుమారు 10 వేల సంవత్సరాల క్రితం వరకు, భూమి పై ఉన్న ప్రతి మనిషికి గోధుమ కళ్ళు ఉండేవని చెబుతున్నారు.
‘అందరూ ఒక వ్యక్తి వారసులే’
కొంతమంది పిల్లలకు వారి తల్లిదండ్రులకు నీలి కళ్ళు లేకపోయినా నీలి కళ్ళు ఉంటాయి. దీని వెనుక సైన్స్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. LadBible నివేదిక ప్రకారం, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ TikTokలో ఓ నిపుణుడు @daveallambymd అకౌంట్ లో ఓ వ్యక్తి నీలి కండ్ల వ్యక్తులందరూ ఒకరికొకరు సంబంధం కలిగి ఉన్నారని వెల్లడించారు. ఎందుకంటే వీరంతా 6 వేల నుంచి 10 వేల సంవత్సరాల క్రితం నల్ల సముద్రం సమీపంలో నివసించిన వ్యక్తి వారసులుగా తెలిపారు.
జన్యుపరమైన మార్పుల వల్ల నీలం కళ్ళు ఏర్పడతాయి..
ఓ వ్యక్తి జన్యువులలో మార్పు వచ్చినప్పుడు నీలి కళ్లు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ జన్యు మార్పు గోధుమ కళ్లను నీలి కళ్ళుగా మారుస్తుంది. డాక్టర్ అల్లంబి అనే ఈ నిపుణుడు, ‘మీకు కూడా నాలాంటి నీలి కళ్ళు ఉంటే, మనమందరం అదే వ్యక్తి వారసులం. కాబట్టి ప్రపంచమంతటా మనందరికీ 700 మిలియన్లు అంటే 70 కోట్లకు పైగా బంధువులు ఉన్నారని తెలిపారు. అయితే వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఒక జన్యు మార్పు ఇంత కాలం ఎలా కొనసాగిందో వింతగా ఉందని కూడా ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.