వివిధ రంగాల్లో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకున్న ప్రముఖుల జీవిత చరిత్రలను సినిమాలుగా రూపొందించేందుకు పలువురు దర్శకనిర్మాతలు ఆసక్తికనబరుస్తున్నారు. ఇప్పటికే కొందరు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రీడాకారుల జీవితాలను తెరపై ఆవిష్కరించారు. యదార్థ ఘటనలతో రూపొందిన ఈ సినిమాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. ఇంకా ఎంతో మంది ప్రముఖుల బయోపిక్‌లు రాబోతున్నాయి. ఈ క్రమంలోనే భారతదేశంలో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన దివంగత శ్రీదేవి బయోపిక్ కూడా రాబోతోందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల దీనిపై శ్రీదేవి భర్త బోనీకపూర్ స్పందించారు. అతను నిర్మించిన ఓ సినిమా ప్రమోషన్‌లో శ్రీదేవి బయోపిక్ ప్రస్తావన వచ్చింది.
‘నా భార్య తన వ్యక్తిగత జీవితం గురించి బయటికి చెప్పడానికి ఎప్పుడూ ఇష్టపడేది కాదు. తను మొదటి నుంచీ చనిపోయేవరకు అలాగే ఉంది. ఆమెకు ఇష్టంలేని పని చెయ్యడం నాకూ ఇష్టంలేదు. ఎంతో గోప్యంగా ఉంచాలనుకునే ఆ విషయాలను ఒక బయోపిక్ ద్వారా సినిమాలో చర్చించడం సరైంది కాదు అని నా ఉద్దేశం. అందుకే నేను బ్రతికి ఉన్నంత కాలం శ్రీదేవి బయోపిక్ చేసేందుకు అనుమతి ఇవ్వను. ఆమె వ్యక్తిత్వం నాకు తెలుసు కాబట్టే ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ వంటి సినిమాలోని క్యారెక్టర్‌కి పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుందని చెప్పాను. అందుకే ఆమె ఆ సినిమాలో నటించింది. మొదట ఆ క్యారెక్టర్ కోసం ఐశ్వర్యారాయ్‌ని తీసుకుందాం అనుకున్నారు. మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకున్న ఐశ్వర్యారాయ్ ఇంగ్లీష్ రాని క్యారెక్టర్ చేస్తే ఎవ్వరూ చూడరని చెప్పాను. ఒక సాధారణ గృహిణిగా జీవితాన్ని గడిపేందుకే ఎక్కువ ఇష్టపడిన శ్రీదేవి అయితేనే ఆ పాత్రకు న్యాయం జరుగుతుందని భావించి ఆమె పేరు సజెస్ట్ చేశాను. ఒక ప్రైవేట్ పర్సన్‌గానే ఉండాలనుకున్న శ్రీదేవి జీవితం బయోపిక్ ద్వారా బహిర్గతం కావడం నాకు ఇష్టం లేదు’ అని స్పష్టం చేశారు బోనీ కపూర్.
కొన్ని దశాబ్దాల చరిత్ర ఉన్న భారతీయ సినిమాలో శ్రీదేవి వంటి హీరోయిన్ మళ్లీ రాదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే అతి చిన్న వయసులోనే నటిగా పరిచయమై ఆ తర్వాత హీరోయిన్‌గా టాప్ పొజిషన్‌కి వెళ్ళిపోయింది. భారతదేశంలోని ఎన్నో భాషల్లో సినిమాలు చేసింది. సౌత్‌లో అయినా, నార్త్‌లో అయినా అందరు టాప్ హీరోలతో కలిసి నటించిన ఘనత ఒక్క శ్రీదేవికే దక్కింది. ఆమె జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పరిశోధకుడు, రచయిత ధీరజ్.. శ్రీదేవి బయోగ్రఫీలో ప్రస్తావించబోతున్నారు. ‘ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్’ పేరుతో ఇది రాబోతోంది. ఈ రచన కోసం శ్రీదేవి కుటుంబ సభ్యుల అనుమతి తీసుకున్నానని ఆయన తెలియజేశారు.