తెలుగు చలన చిత్ర పరిశ్రమ పుట్టినప్పటి నుంచి ఎంతో మంది హీరోలు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు. అంటే కొన్ని సినిమాల్లో నటించి ఆ తర్వాత పరిశ్రమ నుంచి కనుమరుగైపోతున్నారు. కానీ కొంత మంది మాత్రమే తెలుగు కళామ తల్లి ఒడిలో ముద్దు బిడ్డలుగా నిలిచి పోతారు. నిలిచి పోవడమే కాదు తెలుగు కళామ తల్లి కీర్తిని విశ్వ వ్యాప్తం చేసి పరబాషా సినిమా ఇండస్ట్రీని సైతం తెలుగు సినీ పరిశ్రమ వైపు చూసేలా చేస్తారు. అలా పరభాషా చిత్ర పరిశ్రమని తెలుగు చిత్ర పరిశ్రమ వైపు చూసేలా చెయ్యడమే కాకుండా వాళ్ళందరూ అసూయ పడేలా సైతం కీర్తిని సంపాదించిన నటుడు ప్రభాస్. అభిమానులందరూ రెబల్ స్టార్ అని, డార్లింగ్ అని ప్రభాస్ ని పిలుచుకుంటారు. ఎలాంటి పాత్రలో అయిన అవలీలగా ఒదిగిపోయి ఆ పాత్రని పదికాలాలు పాటు ప్రేక్షకులు గుర్తుంచుకునేలా చేయగలిగే కెపాసిటీ ప్రభాస్ సొంతం. కళ్ళెర్రబెట్టి కోపంతో గట్టిగా అరిచాడంటే విలనే కాదు బాక్స్ ఆఫీస్ మొత్తం ప్రభాస్ కి దాసోహం అనాల్సిందే. అసలు ప్రభాస్ నటనకి ఉన్న శక్తి ఎలాంటిదో తెలియాలంటే ప్రభాస్ గురించి చెప్పుకోవలసిన అవసరం లేదు. ఇండియాలో సుమారు ఒక ఇరవై మంది జనం గుమికూడి ఉన్న ప్లేస్ కి వెళ్లి ఇక్కడ ప్రభాస్ ఫాన్స్ ఎవరైనా ఉన్నారా అంటే ఒక 10 చేతులు అయినా మేము ఉన్నాము అనే సమాధానం ఇస్తాయి. అంతటి క్రేజ్ ని సంపాదించిన ప్రభాస్ ది అక్టోబర్ 23న పుట్టిన రోజు.
ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి ప్రభాస్ రాజు. ప్రభాస్ ఏ ముహూర్తాన ‘ఈశ్వర్’ అనే సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించాడో గాని ప్రభాస్ అనే వ్యక్తి ఇప్పుడు కేవలం తెలుగు అగ్ర హీరోనే కాకుండా భారతీయ చిత్ర పరిశ్రమకే అగ్ర హీరో. ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే చాలు తెలుగు ప్రేక్షకులే కాకుండా భారతీయ ప్రేక్షకులు మొత్తం థియేటర్స్ కి క్యూ కడతారు. దీన్ని బట్టి ప్రభాస్ సృష్టించుకున్న సినీ సామ్రాజ్యం ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. కానీ అంతటి క్రేజ్ ని ప్రభాస్ ఓవర్ నైట్ తో సంపాదించలేదు. తన పెద్ద నాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడుగా ‘ఈశ్వర్’ అనే సినిమా తో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ‘వర్షం’, ‘చక్రం’, ‘ఛత్రపతి’, ‘పౌర్ణమి’, ‘బుజ్జిగాడు’, ‘బిల్లా’, ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘మిర్చి’ తదితర సినిమాల ద్వారా లవ్, యాక్షన్, సెంటిమెంట్, కామెడీ ఇలా అన్నింటిలోను సూపర్ గా నటించి లక్షలాది మంది అభిమానులని సంపాదించుకొని తెలుగు సినిమా పరిశ్రమకి ఒక నెంబర్ వన్ హీరో దొరికాడని అందరూ భావించేలా చేసాడు. కానీ వాళ్ళకి తెలియదు ప్రభాస్ కేవలం తెలుగు చిత్రపరిశ్రమకే కాదు భారతీయ చిత్ర పరిశ్రమనే శాసించబోతున్నాడని.
డబ్బు పరంగా లక్షలు కోట్లు అవ్వాలంటే చాలా టైం పడుతుంది గాని లక్షల్లో ఉన్న తన అభిమానులని కోట్లలోకి మార్చుకోవడానికి ప్రభాస్ కి ఎక్కువ టైం పట్టలేదు. ‘ఈశ్వర్’ సినిమాతో సినీ కెరీర్ కి పునాది వేసుకున్న ప్రభాస్ ఆ ఈశ్వరుడి సంకల్పం తో కాబోలు ‘బాహుబలి’ అనే సినిమాని చేసాడు. తన అభిమానులని, ప్రేక్షకులని అలరించాలని చెప్పి నాలుగు సంవత్సరాలు కష్టపడి ఆ సినిమా చేసాడు. ఆ సినిమాలో రాజుగా, పేద వాడుగా రెండు పాత్రల్లో సూపర్ గా నటించి అఖండ భారతీయ సినీప్రేక్షకులు మొతాన్ని తన వశం చేసుకున్నాడు. ప్రభాస్ అనే పేరు వినపడితేనే పులకరించి పోయేలా చేసాడు. బాహుబలి సినిమాని ప్రభాస్ కాకుండా ఇంకొకర్ని ఊహించుకోని విధంగా ప్రభాస్ ఆ పాత్రలో నటించి సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. రెండు భాగాలుగా వచ్చిన ఆ బాహుబలి సినిమాతో ప్రభాస్ తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసాడు. అలాగే భారతీయ సినిమాకి సరికొత్త రికార్డులని కూడా పరిచయం చేసాడు. ఆ తర్వాత అసలైన పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో సత్తా చాటాడు. డిసెంబర్ నెలలో ‘సలార్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అభిమానులందరి చేత డార్లింగ్ అని ముద్దుగా పిలిపించుకొనే ప్రభాస్ కి తెలుగు వన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ.. మీరు మరిన్ని అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ మా దగ్గర ప్రభాస్ ఉన్నాడని ప్రపంచ సినిమాకి గర్వంగా చెప్పుకునే స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాం.