ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల వ‌చ్చీరాగానే అన్న ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఆమెకు వైసీపీ నేత‌లు దీటైన కౌంట‌ర్లు ఇవ్వ‌డం తెలిసిందే. ఇదే సంద‌ర్భంలో ఆమె గురించి ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ పరోక్షంగా ప్ర‌స్తావించారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి త‌దిత‌రుల స‌ర‌స‌న ఆమెను జ‌గ‌న్ చేర్చ‌డాన్ని గ‌మ‌నించొచ్చు.
ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండ‌లో మంగ‌ళ‌వారం వైఎస్సార్ ఆస‌రా నిధుల జ‌మ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా వైఎస్ జ‌గ‌న్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ ప్ర‌సంగిస్తూ చంద్ర‌బాబు, ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న నేత‌ల‌పై విరుచుకుప‌డ్డారు. ఎప్పుడూ మంచి చేయ‌ని చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా పక్క రాష్ట్రం నుంచి స్టార్ క్యాంపెయిన‌ర్లు వ‌చ్చార‌న్నారు.
బాబుకు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేయ‌డానికి ప‌క్క రాష్ట్రానికి చెందిన ద‌త్త పుత్రుడు, అలాగే ఆయ‌న వ‌దిన స్టార్ క్యాంపెయిన‌ర్లుగా ప‌ని చేస్తున్నార‌ని దెప్పి పొడిచారు. ఇంకా చంద్ర‌బాబుకు చాలా మంది స్టార్ క్యాంపెయిన‌ర్లు ఉన్నార‌నే కామెంట్‌ను త‌న చెల్లి, ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌ను దృష్టిలో పెట్టుకునే చుర‌క‌లు అంటించార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
త‌న‌కు స్టార్ క్యాంపెయిన‌ర్లు ఎవ‌రూ లేర‌న్నారు. త‌న స్టార్ క్యాంపెయిన‌ర్లు సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారులే అని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా ఏఏ ప‌థ‌కం కింద ఎంతెంత మంది ల‌బ్ధి పొందారో గ‌ణాంకాల‌తో స‌హా జ‌గ‌న్ వివ‌రిస్తూ, వీళ్లే త‌న స్టార్ క్యాంపెయిన‌ర్ల‌ని జ‌గ‌న్ తెలిపారు. అమ‌రావ‌తిలో బినామీలున్న‌ట్టే, ఇత‌ర పార్టీల్లో చంద్ర‌బాబు స్టార్ క్యాంపెయిన‌ర్లున్నార‌ని విమ‌ర్శించారు.