తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా చెప్పుకున్నప్పటికీ ఇప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ప్రాంతీయ పార్టీగానే రిజిస్టర్ అయి ఉంది. అయితే తెలంగాణలో కూడా టీడీపీ విభాగం ఉండడంతో జాతీయ పార్టీగా మార్చి చంద్రబాబు కేంద్ర అధ్యక్షుడు అయ్యారు. ఆయన కుమారుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
టీడీపీ ఏపీలోనే ఈ రోజుకీ బలంగా ఉంది. తాజా ఎన్నికల్లో అధికారంలోకి రావడంతో భవిష్యత్తుకు ఇప్పట్లో ఢోకా లేదు. అయితే టీడీపీ తెలంగాణ ఏపీలకు రెండు చోట్లా అధ్యక్షులను నియమించడం 2014 నుంచి చేస్తోంది. అధికారం లేని తెలంగాణాలో పలువురు అధ్యక్షులు మారుతూ వస్తున్నారు. ఏపీలో ఒకసారి అధికారం పోయినా మళ్ళీ దక్కడంతో ఇప్పటికి ముగ్గురు మాత్రమే మారారు.
తొలిగా చాన్స్ కిమిడి కళా వెంకటరావుకు వచ్చింది. తరువాత అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అయ్యారు. ఇపుడు పల్లా శ్రీనివాసరావుకు ఇచ్చారు. ఆయన ఏపీలోనే అత్యధిక మెజారిటీతో గెలిచారు. మంత్రి అవుతారు అనుకుంటే పార్టీ ప్రెసిడెంట్ అయ్యారు.
ఆయన మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో పదవీ బాధ్యతలు తీసుకున్నారు. 2029లో టీడీపీని అధికారంలోకి తీసుకుని వస్తామని ఆయన చెప్పారు. కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు దక్కేలా చూస్తామని ప్రభుత్వానికి పార్టీకి మధ్య వారధిగా నిలుస్తామని అన్నారు.
పల్లా శ్రీనివాస్ చురుకైన పార్టీ నేతగా ఉన్నారు. యువకుడు కూడా. ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే ఆ పదవికి న్యాయం చేకూరుతుందని అంటున్నారు. లేకపోతే పార్టీ ఆఫీసులో కూర్చుని పదవి వచ్చింది అని చెప్పుకునేందుకే అవుతుందని అంటున్నారు.
చంద్రబాబు జాతీయ ప్రెసిడెంట్ కాబట్టి జాతీయ స్థాయిలో ఆయన రాజకీయంగా చూస్తే బాగుంటుందని అంటున్నారు. పల్లాకు ఏపీలో పార్టీకి సంబంధించి వ్యవహారాలు అప్పగించి ఆయన ద్వారానే పార్టీ ప్రచారాలు పర్యటనలు చేయిస్తేనే ఆ పదవికి గౌరవం పెరుగుతుందని అంటున్నారు. లేకపోతే ఆరో వేలు మాదిరిగా ఉంటుందని అంటున్నారు.
The post పల్లాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తారా? appeared first on Great Andhra.