జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఖరిలో మార్పు వచ్చింది. పవన్ గురించి ఏమీ మాట్లాడకూడదని జగన్ నిర్ణయించుకున్నారని తెలిసింది. దీని వల్ల పవన్ ఉనికిని గుర్తించి నిరాకరించినట్టు కావడంతో పాటు తమ నాయకుడిని ఏమీ అనలేదనే భావన జనసేన కార్యకర్తలు, మెజార్టీ కాపుల్లో ఏర్పడుతుందనే ఉద్దేశం అంటున్నారు.
ఇటీవల ఢిల్లీలో ధర్నా సందర్భంలోనూ, అలాగే తాజాగా మీడియా సమావేశంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడినే జగన్ టార్గెట్ చేయడం గమనార్హం. కూటమిలోని టీడీపీని మినహాయిస్తే జనసేన, బీజేపీ ఊసే ఎత్తకపోవడం వెనుక జగన్‌కు బలమైన వ్యూహం వుందని తెలుస్తోంది. ఎన్నికల్లో ఓటమికి దారి తీసిన పరిస్థితులపై జగన్ సమగ్రంగా అధ్యయనం చేశారనేందుకు పవన్‌పై జగన్ వైఖరిలో మార్పే నిదర్శనమని వైసీపీ నేతలు అంటున్నారు.
గత ఎన్నికలకు ముందు చంద్రబాబు కంటే పవన్‌నే వైసీపీ నేతలు ఎక్కువ టార్గెట్ చేశారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ కూడా పదేపదే పవన్‌కల్యాన్‌ను దత్త పుత్రుడని దెప్పి పొడిచేవారు. అంతటితో పవన్‌ను జగన్ విడిచి పెట్టలేదు. పవన్ బహు భార్యత్వం గురించి తీవ్రస్థాయిలో జగన్ విమర్శించారు. పవన్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తుండడంతో ఆయన సామాజిక వర్గాన్ని హర్ట్ చేశామనే వాస్తవాన్ని ఎన్నికల ఫలితాల తర్వాత జగన్‌కు తెలిసొచ్చింది.
ఈ నేపథ్యంలో పవన్ గురించి పట్టించుకోకపోవడమే ఉత్తమమని జగన్ గ్రహించినట్టున్నారు. దీని వల్ల రాజకీయంగా రెండు ప్రయోజనాలున్నాయని జగన్ భావన. ప్రభుత్వంలో పవన్ భాగస్వామి అయినప్పటికీ ఆయన్ను పట్టించుకోకపోవడం వల్ల ఆయన సామాజిక వర్గాన్ని తటస్థులుగా మార్చడం, మరోవైపు టీడీపీని ఏకాకి చేయడమే లక్ష్యంగా జగన్ పంథా సాగుతోంది.
రానున్న రోజుల్లో పవన్ విషయంలో తన వైఖరి సత్ఫలితాలు ఇస్తుందని జగన్ నమ్ముతున్నారు. అందుకే అసెంబ్లీ సమావేశాల్లో పవన్ తనను విమర్శించినా జగన్ మాత్రం సంయమనం పాటిస్తున్నారు. ఏదో ఒక రోజు చంద్రబాబు వైఖరిపై పవనే విసుగెత్తి గళం విప్పుతారని వైసీపీ విశ్వసిస్తోంది.
The post పవన్‌పై జగన్ వైఖరిలో మార్పు! appeared first on Great Andhra.