ప్రస్తుతం టాలీవుడ్ లో రూపొందుతోన్న మోస్ట్ హైప్డ్ మూవీలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ ఒకటి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ రావడంతో పాటు.. సెప్టెంబర్ 27 అనేది ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ ‘అత్తారింటికి దారేది’ విడుదలైన తేదీ కావడంతో.. ‘ఓజీ’ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తుందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. అయితే ఇప్పుడదే తేదీపై హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషిస్తున్న సినిమా కర్చీఫ్ వేయడం ఆసక్తికరంగా మారింది.
బ్రహ్మానందం నటిస్తున్న తాజా చిత్రం ‘హ్రశ్వ దీర్ఘ’. నీత ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి చంద్ర దర్శకుడు. ఈ సినిమా తెలుగుతో పాటు నేపాలీ భాషలో రూపుందుతోంది. హాస్య బ్రహ్మ పుట్టినరోజు(ఫిబ్రవరి 1) సందర్భంగా తాజాగా ‘హ్రశ్వ దీర్ఘ’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. నేపాలీ దుస్తులు, నుదుటున నామాలతో బ్రహ్మి లుక్ ఆకట్టుకుంటోంది. అదేవిధంగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘ఓజీ’ కూడా అదే తేదీకి విడుదలైతే పవన్ కళ్యాణ్, బ్రహ్మానందం బాక్సాఫీస్ దగ్గర తలపడినట్లు అవుతుంది.