జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫశ్చాతాప పడుతున్నారా? మద్దతు ఇచ్చే విషయంలో, తెలుగుదేశంతో కలిసి వచ్చే ఎన్నికలలో ఉమ్మడిగా పోటీ చేస్తామని ప్రకటన చేసిన విషయంలో తొందర పడ్డానని ఆయన అనుకుంటున్నారా? పార్టీలో క్షేత్రస్థాయి నుంచి కార్యకర్తల, నాయకుల మనోగతాన్ని స్పష్టంగా తెలుసుకోకుండా తనంత తాను ఏకపక్షంగా ప్రకటన చేసినందుకు ఎదురుదెబ్బ తగులుతున్నదని ఆయన భావిస్తున్నారా?
చంద్రబాబుతో కలిసి పోటీ చేయడం వలన రాగల లాభం కంటే.. సొంత పార్టీలో వెల్లువెత్తుతున్న వ్యతిరేకత వలన జరిగే నష్టం పెద్దదనే అంచనాకు వచ్చారా? అనే అభిప్రాయాలు ఇప్పుడు పార్టీ వర్గాలలో వినిపిస్తున్నాయి.
చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన పట్ల.. పార్టీలోనే అసమ్మతి గళాలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో కాపు వర్గానికి చెందిన నాయకులు ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని పవన్ ప్రకటన పట్ల తమ అసమ్మతిని తెలియజేస్తున్నారు. చంద్రబాబు వెంట నడిచేటట్లయితే తాము పార్టీకి దూరమవుతామని కుండ బద్దలు కొడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఇలాంటి కాపు అసమ్మతి స్వరాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ తాను విశ్వమానవుడిని అని.. తనకు కులంగానే మతం గాని లేవని.. ఎంతగా తన గురించి తాను చెప్పుకుంటున్నప్పటికీ ఆయన జనసేన పార్టీని పూర్తిగా కాపు కులం ఓట్ల మీద మాత్రమే ఆధారపడి నడుపుతున్నారనేది స్పష్టం.
కేవలం కాపు సామాజిక వర్గం ఓట్లు దాదాపుగా అన్ని నియోజకవర్గాలలో అత్యధిక సంఖ్యలో ఉన్నాయనే నమ్మకంతోనే ఆయన ఉభయ గోదావరి జిల్లాల మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన రెండు నియోజకవర్గాలు గాజువాక భీమవరం కాపు సామాజిక వర్గానికి పట్టున్న నియోజకవర్గం అనే సంగతి కూడా గుర్తుంచుకోవాలి. ఈ రకంగా ప్రధానంగా కాపు వర్గం మీదనే ఆధారపడి జనసేనాని పవన్ కళ్యాణ్ తన రాజకీయం నడిపిస్తున్నారు.
అలాంటిది, చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవడం వలన కాపు వర్గం దూరమయ్యే పరిస్థితి వస్తే అది ఆయనకు పెద్ద షాక్ అని చెప్పుకోవాలి. చంద్రబాబు వలన కాపులు తన పార్టీకి దూరమవుతున్నారనే వాస్తవాన్ని గుర్తించి, పొత్తు నిర్ణయాన్ని సమీక్షించుకుంటారా? లేదా, తాను మోనార్క్ అని, ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత తన మాట తానే విననని మొండిగా ముందుకు దూసుకెళ్తారా అనేది వేచి చూడాలి.