తెలుగులో అడపాదడపా మల్టీస్టారర్లు వస్తున్నాయి. అయితే ఇది మాత్రం ఎపిక్ మల్టీస్టారర్. పవన్ కల్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందనేది కలలో కూడా ఊహించుకోవడం కష్టమే. ఆకాశాన్ని దాటి అంచనాలున్నాయి.
నిజానికి వీళ్ల ముగ్గుర్ని పెట్టి ఓ కథ రాయాలనే ఆలోచన కూడా చాలామంది మేకర్స్ చేయరు. కానీ హరీశ్ శంకర్ కు ఆ ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా ఓ స్టోరీలైన్ కూడా రాసుకున్నాడు.
“పవన్ కల్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా ఓ సినిమా అనుకున్నాను. ఓ లైన్ ఎప్పట్నుంచో వర్క్ చేసి పెట్టుకున్నాను. అది చేస్తే అదే పెద్ద పాన్ ఇండియా మూవీ అవుతుంది.”
గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో హరీశ్ శంకర్ ఈ మేటర్ బయటపెట్టారు. ఇప్పటివరకు పెద్ద స్పాన్ ఉన్న సినిమా తీయని ఈ దర్శకుడు.. పాన్ ఇండియా తీద్దామనే ఆలోచనతో తను కథ రాయనని, పెద్ద స్పాన్ అనేది సహజసిద్ధంగా కథలో రావాలని అన్నాడు. కార్యరూపం దాల్చకుండా పాన్ ఇండియా అనే మాటలు, 300 కోట్లు బడ్జెట్ అనే కబుర్లు చెప్పడం తనకు నచ్చదంటున్నాడు.
చాలా ఏళ్ల కిందట పవన్ కల్యాణ్, చిరంజీవి హీరోలుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ ప్రకటించారు సుబ్బరామిరెడ్డి. అది సాధ్యం కాలేదు. కనీసం హరీశ్ శంకర్ అనుకున్న కాన్సెప్ట్ అయినా కార్యరూపం దాలిస్తే, మెగా ఫ్యాన్స్ కు పండగే.