EntertainmentLatest News

పాతికేళ్ళ ప్రస్థానం.. స్టార్‌ యాంకర్‌గా సుమ స్థానం సుస్థిరం!


సుమ.. ఈ పేరు విననివారు, ఆమె గురించి తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. రెండున్నర దశాబ్దాలుగా టీవీ షోస్‌లో హోస్ట్‌గా అయినా, సినిమా ఫంక్షన్లలో యాంకర్‌గా అయినా సుమ అయితేనే ఒక నిండుదనం, ఆ కార్యక్రమానికి ఒక సందడి ఏర్పడుతుందని అందరూ భావిస్తారు. దానికి తగ్గట్టుగానే తన చలాకీతనంతో, సమయస్ఫూర్తితో ఆ కార్యక్రమాన్ని ఆద్యంతం నవ్వుల్లో ముంచెత్తగల టాలెంట్‌ ఉన్న యాంకర్‌ సుమ. ఆమెతోపాటు యాంకరింగ్‌ స్టార్ట్‌ చేసిన ఎంతో మంది యాంకర్లు తెరమరుగైపోయారు. కానీ, సుమ మాత్రం ఈ రంగంలో తన ఆధిపత్యాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉంది. 

సిల్వర్‌ స్క్రీన్‌పై రాణించలేకపోయిన సుమ.. బుల్లితెరను రఫ్పాడిస్తూ స్టార్‌ యాంకర్‌ అనే సింహాసనాన్ని కొన్ని సంవత్సరాల క్రితమే అధిష్టించి తన స్థానాన్ని రోజురోజుకీ మరింత పటిష్టం చేసుకుంటోంది. యాంకర్‌ సుమ తన కెరీర్‌లో ఎన్నో ఉన్నత శిఖరాల్ని అధిరోహించారు. ఈటీవీలో ప్రసారమైన స్టార్‌ మహిళకు సంబంధించి కొన్ని వేల ఎపిసోడ్స్‌కు హోస్ట్‌గా వ్యవహరించి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. పంచావతారం, భలే ఛాన్సులే, క్యాష్‌, సుమ అడ్డా వంటి ప్రోగ్రామ్స్‌ ఆమెకు తిరుగులేని పేరును సంపాదించిపెట్టాయి. అంతేకాదు సంగీత కార్యక్రమమైన స్వరాభిషేకంలో కూడా తనదైన శైలిని ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకుంది. 

1974 మార్చి 22 కేరళలోని పాలక్కాడ్‌లో జన్మించింది. ఉద్యోగ రీత్యా వారి కుటుంబం సికింద్రాబాద్‌లో స్థిరపడింది. దీంతో ఆమె బాల్యం, విద్యాభ్యాసం అంతా సికింద్రాబాద్‌లోనే జరిగింది. క్లాసికల్‌ డాన్స్‌, సంగీతంలో ప్రావీణ్యం ఉన్న సుమ.. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘కళ్యాణప్రాప్తిరస్తు’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. కానీ, సినిమాలు ఆమెకు అచ్చి రాలేదు. అందుకే వ్యాఖ్యాతగా అవతారమెత్తారు. మాతృభాష మలయాళం అయినప్పటికీ తెలుగు అనర్గళంగా మాట్లాడగలదు. ఎన్నో టీవీ షోలలో కనిపిస్తూనే అప్పుడప్పుడు పెద్ద స్క్రీన్‌పై కూడా దర్శనమిస్తూ ఉంటుంది. పవిత్రప్రేమ, చాలా బాగుంది, వర్షం, స్వరాభిషేకం, ఢీ, బాద్‌ షా, ఓ బేబీ వంటి సినిమాల్లో నటించింది. గత ఏడాది సుమ ప్రధాన పాత్రలో ‘జయమ్మ పంచాయతీ’ అనే సినిమా రూపొందింది. దేవదాస్‌ కనకాల దర్శకత్వంలో రూపొందిన ‘మేఘమాల’ సీరియల్‌లో నటిస్తున్న సమయంలో రాజీవ్‌ కనకాలతో పరిచయం ఏర్పడిరది. ఆ తర్వాత అది ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. 1999 ఫిబ్రవరి 10న సుమ, రాజీవ్‌ కనకాల పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. రోషన్‌ కార్తీక్‌ కనకాల, సేహాశ్విని. రోషన్‌ హీరోగా రూపొందిన ‘బబుల్‌గమ్‌’ చిత్రం గత ఏడాది డిసెంబర్‌లో విడుదలై హీరోగా రోషన్‌కి మంచి పేరు తెచ్చింది. 25 సంవత్సరాలుగా బుల్లితెరపై ప్రతిరోజూ కనిపిస్తూ తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్న సుమ మార్చి 22న తన పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకు బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తోంది తెలుగువన్‌. 



Source link

Related posts

వేణుమాధవ్‌ కామెడీగా చెప్పాడు.. ప్రశాంత్‌ నీల్‌ సీరియస్‌గా తీసుకొని బ్లాక్‌బస్టర్‌ కొట్టాడు!

Oknews

సీఎం సాబ్..! సామ్యానుడికి దగ్గరే అంటున్న కాంగ్రెస్ నేతలు

Oknews

గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఆల్మోస్ట్ లాక్డ్

Oknews

Leave a Comment