సంబంధం లేని దాంట్లో వేలు పెట్టే వారిని పానకంలో పుడక అని అభివర్ణిస్తుంటారు. వైసీపీలో పానకంలో పుడకల్లాంటి నాయకులు కాని నాయకులు చాలా మంది ఉన్నారు. వీరిలో అగ్రపీటం సజ్జల రామకృష్ణారెడ్డిది.
నాడు వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ప్రతి పరిపాలనపరమైన నిర్ణయాల గురించి మీడియాకు వెల్లడించడానికి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చేవారు. అందుకే ఆయన్ను ప్రత్యర్థులు సకలశాఖ మంత్రి అని సెటైర్స్ విసిరేవారు.
అధికారం పోయినప్పటికీ పానకంలో పుడకలు మాత్రం జగన్ వెంటే వుండడం విమర్శలకు దారి తీసింది. జగన్‌పై కంటే పానకంలో పుడకలపై వ్యతిరేకతే వైసీపీ ఓటమికి ప్రధాన కారణమనే చర్చ విస్తృతంగా సాగుతోంది. అయినప్పటికీ జగన్ మాత్రం పానకంలో పుడకల్ని పక్కన పెట్టడానికి జగన్ ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సభ్యుల సమావేశంలో తగదునమ్మా అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొనడం చర్చనీయాంశమైంది.
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ తన పార్టీ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఎలాంటి సంబంధం లేని సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశంలో ఆసీనులయ్యారు. సజ్జల ఎంపీ ఎప్పుడయ్యాడబ్బా అని నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు.
సజ్జలను ఎంత వరకు ఉపయోగించుకోవాలో ఆ మేరకే పరిమితం చేయాలన్న స్పృహ తమ నాయకుడు జగన్‌లో కొరవడిందని సొంత పార్టీ ఎంపీలు విమర్శిస్తున్నారు. నీడలా సజ్జలను వెంటపెట్టుకోవడంపై జగన్‌ను వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇలాగైతే జగన్‌ను అపార్థం చేసుకోవాల్సి వుంటుందని అంటున్నారు.
The post పానకంలో పుడకలా సజ్జల! appeared first on Great Andhra.