పాన్ ఇండియా వలలో టాలీవుడ్


రాను రాను మెల మెల్లగా డిజిటల్ సంస్థల గుప్పిట్లోకి వెళ్లిపోతోంది సినిమా పరిశ్రమ. ముఖ్యంగా పాన్ ఇండియా అంటే చాలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. భారీ పాన్ ఇండియా సినిమాలు వేరు. వాటి లెక్క వేరు. కానీ పులిని చూసి వాత పెట్టుకున్నట్లు పాన్ ఇండియా కు వెళ్లే మిడ్ రేంజ్ సినిమాలు వేరు.

మరోపక్కన డిజిటల్ అమ్మకాల మీద ఆధారపడి సినిమాలు పూర్తి చేసి విడుదల చేసే వ్యవహారం జ‌రుగుతోంది. డిజిటల్ సంస్థలతో చేసుకున్న అగ్రిమెంట్ల మేరకు విడుదల డేట్ ను ఫిక్స్ చేయాల్సి వస్తోంది. డిజిటల్ అమ్మకాలు జ‌రగకుండా విడుదల చేయలేని పరిస్థితి. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను తెలుసుకుని, దానికి ఎన్ని వారాలు ముందుగా స్లాట్ దొరుకుతుందో చూసుకోవాల్సి వుంది, పైగా పాన్ ఇండియా సినిమా అంటే మన దగ్గర డేట్ చూసుకుంటే సరిపోదు. హిందీ, తమిళంలో కూడా కీలకంగా డేట్ చూసుకోవాలి. పోటీ చూసుకోవాలి.

ఇలా అన్ని విధాలుగా డిజిటల్ సంస్థల గుప్పిట్లో చిక్కకుంటున్నాయి సినిమాలు. ఓ సినిమా ప్రారంభిస్తే ఇప్పుడు ముందు మూడు సవాళ్లు.. డిజిటల్ అమ్మకాలు. శాటిలైట్ అమ్మకాలు.. హిందీ విడుదల ఎలా? వీటిల్లో డిజిటల్ అమ్మకాలు కీలకం. అవి కూడా హిందీ డిజిటల్ తీసుకోవడం తక్కువ. కేవలం సౌత్ లాంగ్వేజెస్ తీసుకోవడం ఎక్కువ. శాటిలైట్ దగ్గరకు వచ్చే సరికి తెలుగు శాటిలైట్ మార్కెట్ పడిపోయింది. తీసుకోవడమే తక్కువ.. తీసుకున్నా ఇచ్చేది తక్కువ. ఇక హిందీ శాటిలైట్ కు కాస్త రేటు వుంది. కానీ హిందీ విడుదల పాన్ ఇండియా సినిమా అయితే నేరుగా చేసుకోవాల్సిందే.

కానీ హిందీ థియేటర్ హక్కులు తీసుకుని, పంపిణీ చేసే వారు ఎవరూ లేరు. కేవలం పంపిణీ చేసి పెట్టే వారే ఎక్కువ. కానీ హిందీ బెల్ట్ లో సినిమా విడుదల చేయాలంటే ముందుగా కోట్లు ఖర్చు అవుతుంది. అందువల్ల ఎవరో ఒకరిని చూపి పంపిణీకి ఇచ్చేస్తున్నారు. వాళ్లు కూడా కనీసం ప్రింట్, పబ్లిసిటీ, క్యూబ్ ఖర్చులు వచ్చే సినిమాలు మాత్రం తీసుకుంటున్నారు. అవి కూడా రాకపోతే నిర్మాత దగ్గర నుంచి మళ్లీ వసూలు చేస్తారు.

పాన్ ఇండియా అంటే ఓ సమస్య కాదు. విడుదల చేసే ప్రతి కంటెంట్ అన్ని భాషల్లో ప్రిపేర్ చేయాలి పాటలు రాయించాలి. పాడించాలి. దేవర సెకెండ్ సింగిల్ ఎందుకు ఆలస్యం అవుతోంది అంటే ఇదే కారణం. అన్ని భాషల్లో కంటెంట్ రెడీ కావాలి. లిరికల్ వీడియోలతో సహా.

మొత్తం మీద తెలుగు సినిమా ఇప్పుడు డిజిటల్, పాన్ ఇండియా గుప్పిట్లో చిక్కుకుంది. చిన్న హీరో, పెద్ద హీరో అని లేదు. అన్నీ పాన్ ఇండియా సినిమాలే. భారీ బడ్జెట్ లే. కొడితే కుంభస్ధలం.. లేదంటే కుదేలు.

The post పాన్ ఇండియా వలలో టాలీవుడ్ appeared first on Great Andhra.



Source link

Leave a Comment