సినిమా విడుదలకు ముందు సాంగ్స్ రిలీజ్ చేసి.. సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా చేయడం సహజం. అయితే సినిమా విడుదలైన రెండు నెలల తర్వాత.. సాంగ్ రిలీజ్ చేయడం ఎప్పుడైనా చూశారా?. ‘గుంటూరు కారం’ మూవీ టీం అలాంటి కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది.
‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా ‘గుంటూరు కారం’. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ డ్రామా.. ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఫిబ్రవరి 9న ఓటీటీలోకి అడుగుపెట్టగా.. అక్కడ మాత్రం మంచి రెస్పాన్స్ తో అదరగొడుతోంది. మొత్తానికి ఈ చిత్రం.. థియేటర్లలో విడుదలై రెండు నెలలు అయింది, ఓటీటీలోకి వచ్చి నెల దాటింది. ఇలాంటి సమయంలో ‘గుంటూరు కారం’కి సంబంధించి ఊహించని అప్డేట్ వచ్చింది.
‘గుంటూరు కారం’కి థమన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఆయన స్వరపరిచిన ఆరు పాటలు విడుదల కాగా, దాదాపు అన్ని పాటలకు మంచి స్పందనే లభించింది. అయితే ఉన్నట్టుండి.. ఈ సినిమాలో ఏడో పాట ఉందని, దానిని త్వరలోనే విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించి సర్ ప్రైజ్ చేశాడు థమన్. ఈ శుక్రవారం(మార్చి 15) ‘గుంటూరు కారం’ ఏడో పాట విడుదలవుతుందని, ఇది సూపర్ స్టార్ కోసం మేమిచ్చిన బెస్ట్ అవుట్ పుట్ అని, ప్రస్తుతం లిరికల్ వీడియో రెడీ అవుతోందని తెలిపాడు. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. సినిమా విడుదలైన రెండు నెలలకు లిరికల్ వీడియో రిలీజ్ చేయడం ఏంటి?.. ఇలా చేయడం భారతీయ సినిమా చరిత్రలోనే మొదటిసారి అయ్యుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే.. కొంపదీసి ఇంకా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించి కొత్తగా సినిమాలో యాడ్ చేస్తారా అని సెటైర్స్ వేస్తున్నారు. ఇక కొందరు ఇతర హీరోల అభిమానులేమో.. “మీ కష్టం పగోడికి కూడా రాకూడదు బ్రో” అంటూ మహేష్ ఫ్యాన్స్ పై జాలి చూపిస్తున్నారు.
మరోవైపు, కొందరు మహేష్ అభిమానులు.. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కి వార్నింగ్ లు ఇస్తున్నారు. అసలే మహేష్ తన నెక్స్ట్ మూవీని రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్నాడు. దీంతో మహేష్ సినిమా నుంచి కొత్త పాట రావాలంటే కనీసం రెండు మూడేళ్లు పడుతుంది. అందుకే అప్పటివరకు ఈ పాట బాగుంటే ఎంజాయ్ చేస్తాం.. లేదంటే దారుణంగా ట్రోల్ చేస్తాం అని థమన్ కి సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ లు ఇస్తున్నారు. మరి ఈ సాంగ్ అభిమానులు మెచ్చేలా ఉంటుందా లేదా అనేది ఈ శుక్రవారం తేలిపోతుంది.