దిశ, ఫీచర్స్ : పిల్లలను కనండి, డబ్బు సంపాదించండి అంటూ పొరుగు దేశం చైనాలో ఓ కంపెనీ మహిళలకు ఓ వింత ఆఫర్ ఇవ్వడం ఇంటర్నెట్‌లో దుమారం రేపుతుంది. 28 నుంచి 42 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు సర్రోగేట్ తల్లులుగా మారడం ద్వారా లక్షలు సంపాదించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు కంపెనీ ఆన్‌లైన్ ప్రకటన ఇచ్చింది. అయితే చైనాలో సరోగసీ చట్టవిరుద్ధం. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందట.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన హుచెన్ హౌస్ కీపింగ్ అనే కంపెనీ ఈ వింత ప్రకటన ఇచ్చింది. కంపెనీ ప్రకటన ప్రకారం 28 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు అద్దె తల్లులుగా మారడం ద్వారా 35,000 US డాలర్లు (అంటే రూ. 25 లక్షల కంటే ఎక్కువ) సంపాదించే అవకాశం ఉంది.
అదేవిధంగా 29 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు కంపెనీ 2,10,000 యువాన్లను (సుమారు రూ. 25 లక్షలు) చెల్లిస్తుంది. అలాగే 40 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు ఈ పని చేయాలనుకుంటే, కంపెనీ వారికి 1,70,000 యువాన్లను (రూ. 20 లక్షలు) ఆఫర్ చేసింది.
సరోగసీ నిషేధం..
కొన్ని నివేదికల ప్రకారం దేశంలో సరోగసీ చట్టవిరుద్ధమైనప్పటికీ, కంపెనీ జిన్యాంగ్, షాంఘైలో ఈ వ్యాపారాన్ని విచక్షణారహితంగా కొనసాగిస్తోంది. కస్టమర్ కోరిక మేరకే డబ్బును నిర్ణయించినట్లు కంపెనీ స్థానిక మీడియాకు తెలిపింది. అయితే ఆ ప్రకటన చూసిన వెంటనే అధికారులు చెవులు రిక్కించారు. దీంతో వెంటనే ఈ వ్యవహారం పై విచారణకు ఆదేశాలు కూడా జారీ చేశారట.
అయితే ఈ ఆఫర్‌తో చాలా కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్నామని కంపెనీ తెలిపిందట. చైనాలో సరోగసీని నిషేధించినప్పటికీ చట్టపరమైన లొసుగులను ఉపయోగించుకుని కంపెనీ దేశంలో తన వ్యాపారాన్ని నడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో ప్రకటనల గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇది మానవ అక్రమ రవాణాను ప్రోత్సహిస్తుందని చాలా మంది సిటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.