పిసిఓయస్ దేశంలో ప్రతి 5వ మహిళకు ఉన్న సమస్య.. జాగ్రత్త తీసుకోకపోతే ముప్పు తప్పదా?


posted on Dec 26, 2024 9:30AM

 

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) అనేది పునరుత్పత్తి వయస్సు గల స్త్రీలను ప్రభావితం చేసే చాలా సాధారణ సమస్య.   ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్త్రీలు అందరూ దీని బారిన పడే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి హార్మోన్ల అసమతుల్యత,  నెలసరి సరిగా రాకపోవడం, అండాశయంలో  తిత్తులు వంటి సమస్యలను కలిగి ఉంటుంది.  దీని కారణంగా అనేక రకాల ఆరోగ్య దుష్ప్రభావాలు వచ్చే ప్రమాదం ఉంది. చాలా మంది మహిళలు పిసిఒఎస్ గురించి, దాని వల్ల వచ్చే సమస్యలను బహిరంగంగా చెప్పలేకపోతుంటారు.  సకాలంలో వ్యాధి నిర్ధారణ,  చికిత్స లేకపోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.


కేవలం భారతదేశంలోనే ప్రతి ఐదుగురు కౌమారదశలో ఉన్న మహిళల్లో ఒకరు PCOSతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దీని అంచనా 6% నుండి 21% మధ్య ఉంటుంది. ఒక అధ్యయనంలో నిపుణులు PCOS వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించి దీనికి చికిత్స  తీసుకోకపోతే భవిష్యత్తులో ఇది జ్ఞాపకశక్తి  లేదా మెదడు సంబంధ సమస్యలను కూడా కలిగిస్తుందని అంటున్నారు.

పిసిఓయస్..

PCOS వల్ల కలిగే సమస్యల గురించి తెలుసుకునే ముందు పిసిఓయస్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడం ముఖ్యం..!


పిసిఒఎస్ అనేది పునరుత్పత్తి వయస్సు గల మహిళల్లో వచ్చే వ్యాధి. హార్మోన్ల మార్పులకు సంబంధించిన ఈ సమస్యలో  ఋతు చక్రం ప్రభావితమవుతుంది. ఇందులో పీరియడ్స్ అస్సలు జరగవు లేదా చాలా రోజుల పాటు కొనసాగవచ్చు. ఇది కాకుండా ఈ వ్యాధిలో  అండాశయాల వెలుపలి అంచున ద్రవాలతో నిండిన చిన్న తిత్తులు ఉండవచ్చు. వీటిని సిస్ట్ లు అని అంటారు. PCOS యొక్క దీర్ఘకాలిక సమస్య.  ఇది  గర్భం దాల్చడంలో ఇబ్బందిని కలిగిస్తుంది.

ఈ ముప్పులు తప్పవా?

40 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళల్లో పిసిఒఎస్ సమస్య మెదడు ఆరోగ్య సంబంధిత సమస్యలను కలిగిస్తుందని ఓ అధ్యయనం కనుగొంది.  PCOS ఉన్న స్త్రీలకు జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం,  మధ్య వయసులో ఆలోచనా సామర్థ్యంలో మార్పులు ఎక్కువగా ఉంటాయట.  ఇది జీవిత నాణ్యత, కెరీర్,  ఆర్థిక భద్రతతో సహా అనేక విధాలుగా  స్త్రీలను ప్రభావితం చేస్తుంది. పిసిఓయస్ ఉన్న మహిళలలో ఒత్తిడి కారణంగా అధికంగా ఆహారం తీసుకోవడం, అది కాస్తా అధిక బరువుకు కారణం కావడం వంటి సమస్యలు ఏర్పడతాయి. వీటి కారణంగా  ఊబకాయం, మధుమేహం వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

                                  *రూపశ్రీ. 



Source link

Leave a Comment