ఈమధ్య కాలంలో భారీ సినిమాలను రెండు భాగాలుగా తెరకెక్కించడం కామన్ అయిపోయింది. అయితే రాను రాను అది మూడు భాగాలుగా మారేలా ఉంది. ఇప్పటికే ‘కేజీఎఫ్’ పార్ట్-3 ఉంటుందని ఆ మూవీ టీం ప్రకటించగా.. ఇప్పుడదే బాటలో ‘పుష్ప’ కూడా పయనించనుందని తెలుస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో రూపొందిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ యాక్షన్ డ్రామా 2021 డిసెంబర్ లో విడుదలై పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటింది. వరల్డ్ వైడ్ గా రూ.360 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం పుష్పకి రెండో భాగంగా ‘పుష్ప: ది రూల్’ తెరకెక్కుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ‘పుష్ప-2’ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ కి, గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా.. రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలనాలు సృష్టించడం ఖాయమనే అంచనాలున్నాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు ‘పుష్ప’కి సంబంధించి ఒక ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి మూడో భాగం కూడా ఉందట. అంతేకాదు ‘పుష్ప: ది రోర్’ అని ఇప్పటికే మూడో భాగానికి టైటిల్ కూడా ఫిక్స్ చేశారట. అయితే ఈ మూడో భాగం ‘పుష్ప-2’ విడుదలైన వెంటనే ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అల్లు అర్జున్ ఇప్పటికే త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఒక సినిమా కమిట్ అయ్యి ఉన్నాడు. అలాగే అట్లీ లేదా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఓ మూవీ చేసే అవకాశముంది అంటున్నారు. మరోవైపు సుకుమార్ కూడా తన తదుపరి సినిమాని రామ్ చరణ్ తో చేయాల్సి ఉంది. మరి బన్నీ-సుకుమార్.. ముందు ‘పుష్ప-3’ పూర్తి చేసి ఇతర ప్రాజెక్ట్స్ పైకి వెళ్తారా? లేక ముందుగా వేరే ప్రాజెక్ట్స్ చేసి కాస్త గ్యాప్ తో ‘పుష్ప-3’ చేస్తారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.