‘పుష్ప-2’ (Pushpa 2) చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆగస్టు 15న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడనుందని న్యూస్ వినిపిస్తోంది. కానీ, మేకర్స్ ఈ వార్తను ఖండించడం లేదు.. అలా అని కొత్త తేదీని కూడా అనౌన్స్ చేయడం లేదు. దీంతో అసలు ఈ సినిమా ఆగస్టు 15న విడుదలవుతుందా లేదా అనే సస్పెన్స్ నెలకొంది.
‘పుష్ప-2’ విడుదల విషయంలో తెరవెనుక పెద్ద కథే నడుస్తుందట. రిలీజ్ డేట్ ఆగస్టు 15 కి రెండు నెలల సమయం కూడా లేదు. కానీ షూటింగ్ చేయాల్సింది ఇంకా 50 రోజుల పైనే ఉందట. దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి.. ముఖ్యంగా సీజీ కి ఎక్కువ సమయం పడుతుంది. సుకుమార్ అండ్ టీమ్ విశ్రాంతి లేకుండా ప్రస్తుతం మూడు యూనిట్లుగా వర్క్ చేస్తున్నారు. రెండు యూనిట్లు హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో, మరో యూనిట్ మారేడుమిల్లిలో షూట్ చేస్తున్నారు. చెప్పిన తేదీకి చిత్రాన్ని విడుదల చేయాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నారట. అయితే ఎంత ట్రై చేసినా.. ఆగస్టు 15 కి ఈ సినిమా రావడం కష్టమనేది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.
ఇదిలా ఉంటే, దర్శకుడు సుకుమార్ (Sukumar) కూడా ఆగస్టు 15 కి ‘పుష్ప-2’ చిత్రాన్ని విడుదల చేయడం సాధ్యం కాదనే అభిప్రాయానికి వచ్చాడట. పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలున్న సినిమా కావడంతో.. రిలీజ్ డేట్ ని దృష్టిలో పెట్టుకొని, ఇలా పరుగులు పెట్టి సినిమా పూర్తి చేయడం కరెక్ట్ కాదని సుకుమార్ భావిస్తున్నాడట. కాస్త లేట్ అయినా.. ఆడియన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మంచి అవుట్ పుట్ ఇవ్వాలనేది ఆయన ఉద్దేశమట. అయితే ఈ విషయాన్ని హీరో అల్లు అర్జున్ (Allu Arjun) తో నేరుగా చెప్పని సుకుమార్.. నిర్మాతలు మైత్రి మేకర్స్ ని చెప్పమని కోరుతున్నాడట. రిలీజ్ డేట్ టార్గెట్ ని పక్కన పెట్టి, కూల్ గా వర్క్ చేస్తేనే.. మనం అనుకున్న అవుట్ పుట్ వస్తుందని నిర్మాతలను ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడట. అయితే బన్నీ మాత్రం తగ్గేదేలే అంటున్నాడట. ప్రస్తుతం సినిమాపై ఓ రేంజ్ లో హైప్ ఉందని, పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ అంత హైప్ వస్తుందో లేదో తెలియదని.. అందుకే ఎట్టిపరిస్థితుల్లో ఆగస్టు 15 కే విడుదల చేయాలని నిర్మాతలపై ఒత్తిడి తీసుకు వస్తున్నాడట. కానీ ఇదే విషయాన్ని సుకుమార్ తో మాత్రం డైరెక్ట్ గా చెప్పట్లేదట.
సుకుమార్, అల్లు అర్జున్ మంచి స్నేహితులు. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ఎంతో ఇష్టం, గౌరవం ఉన్నాయి. కానీ ‘పుష్ప-2’ రిలీజ్ విషయంలో మాత్రం.. ఇద్దరూ ఒకరితో ఒకరు చర్చించుకోకుండా.. నిర్మాతలతో మాట్లాడుతున్నారట. ఒకరేమో పోస్ట్ పోన్ చేద్దామని, మరొకరేమో చెప్పిన డేట్ కే రిలీజ్ చేయాలని పట్టుబడుతుండటంతో.. మధ్యలో నిర్మాతలు నలిగిపోతున్నారట.