జగన్ ప్రభుత్వంలో వివిధ శాఖల్లో చేసిన పనులు, అలాగే సంక్షేమ పథకాల అమలుకు ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి రాబట్టుకోవడం ఎలా?… ఇదే ఇప్పుడు అతి పెద్ద సవాల్‌గా మారింది. గతంలో చంద్రబాబు హయాంలో కూడా పెండింగ్ బిల్లులు తక్కువేం కాదు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, టీడీపీ హయాంలో పెండింగ్ బిల్లుల్ని పక్కన పెట్టేసింది. దీంతో బిల్లుల కోసం న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది.
కోర్టు ఆదేశాలిస్తే తప్ప, జగన్ ప్రభుత్వం తన ముందున్న పాలకుల హయాంలోని పెండింగ్ బిల్లులకు మోక్షం కల్పించలేదు. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం పెండింగ్ బిల్లుల నిగ్గు తేల్చే పనిలో నిమగ్నమైంది. ప్రాధమిక అంచనా ప్రకారం రూ.లక్ష కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు వుంటాయని అధికారులు చెబుతున్నారు. ఈ బిల్లుల వచ్చే మార్గం ఏదని కాంట్రాక్టర్లు దారులు వెతుకుతున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో చేసిన వాటికి ప్రస్తుత ప్రభుత్వం చెల్లిస్తుందో, లేదో అనే ఆందోళన వారిని వెంటాడుతోంది.
ముఖ్యంగా సాగునీటి రంగానికి సంబంధించి భారీగా పెండింగ్ పెట్టినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ శాఖకు సంబంధించి రూ.22 వేల కోట్ల పెండింగ్ బిల్లు ఉందని సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలంటే తమ ప్రభుత్వానికి ఎలా సాధ్యమవుతుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రభుత్వానికి, పెండింగ్ బిల్లులు గోరుచుట్టుపై రోకటిపోటు సామెత చందంగా మారింది.
చిన్న కాంట్రాక్టర్లకు కూడా డబ్బు చెల్లించనని కూడా ఉన్నాయంటున్నారు. విద్యార్థులకు ఇచ్చే చిక్కీలు, గుడ్లు తదితర వాటికి కూడా బిల్లులు పెండింగ్‌లు ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల గురించి ప్రభుత్వం ప్రజలకు చెప్పాలనే ఆలోచనతో కసరత్తు చేస్తోంది.
The post పెండింగ్ బిల్లులు వచ్చే మార్గం ఏదీ? appeared first on Great Andhra.