సోషల్ మీడియాలో కొందరు హద్దుమీరి ప్రవర్తిస్తుంటారు. ట్రోల్స్ పేరుతో పిల్లలు, మహిళలపై దారుణమైన వ్యాఖ్యలు చేసి పైశాచిక ఆనందం పొందుతుంటారు. ముఖ్యంగా సినిమా వారిని, వారి కుటుంబాలను టార్గెట్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేస్తుంటారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవడానికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(MAA) రంగంలోకి దిగింది. సినిమా ఆర్టిస్ట్ లపై చేస్తున్న ట్రోలింగ్స్ పై మా ప్రతినిధులు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. డీజీపీని కలిసి వారిలో ప్రముఖ నటులు రాజీవ్ కనకాల, శివ బాలాజీ, శివ కృష్ణ ఉన్నారు.
ఈ సందర్భంగా రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. ” ఈమధ్య ట్రోల్స్, మీమ్స్ శృతిమించిపోతున్నాయి. మా తెలుగువారు ఇంత దిగజారిపోయి సంస్కృతి ఎప్పుడూ లేదు. ఇది ఎవరికీ మంచిది కాదు. పెళ్ళాం, పిల్లలు, కుటుంబ సభ్యులపై ట్రోల్స్ చేయడం మంచి పరిణామం కాదు. ట్రోల్స్ నవ్వుకునేలా ఉండాలి.. ఇలా ఇబ్బంది పడేలా ఉండకూడదు. ఇక మీదట నటీనటులు మీద ఇలాంటి ట్రోల్స్ చేస్తే చేస్తే సహించేది లేదు.” అన్నారు.
శివ బాలాజీ మాట్లాడుతూ.. “సుమారు 200 యూట్యూబ్ చానల్స్ లిస్టును డిజిపి కి సమర్పించాము. డిజిపి సానుకూలంగా స్పందించారు. సైబర్ సెక్యూరిటీ లోనే ఒక స్పెషల్ వింగ్ ట్రోలర్ల పై నిఘా ఉంచుతామని డీజీపీ తెలిపారు. దారుణమైన ట్రోల్స్ కి పాల్పడే వారిని టెర్రరిస్టులుగా పరిగణిస్తాము” అన్నారు.
శివ కృష్ణ మాట్లాడుతూ.. “ట్రోల్స్ వల్ల లేడీ ఆర్టిస్ట్ లు ఎక్కువ గా ఇబ్బందులు పడుతున్నారు. మహిళా ఆర్టిస్ట్ ల క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. కొంత మంది యూట్యూబర్స్ డబ్బు సంపాదన కోసం ఇలా చేస్తున్నారు. పొలిటికల్ అండ్ సినిమా, జర్నలిస్టు ల మీద ఇలాంటి ట్రోల్స్ చేస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. డిజిపి గారు కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.” అన్నారు.