తెలుగు సినిమా రేంజ్ పెరిగిందన్నా.. వరల్డ్‌వైడ్‌గా తెలుగు సినిమాకు గొప్ప గుర్తింపు వచ్చిందన్నా.. దానికి కారణం ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘బాహుబలి’ సిరీస్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సిరీస్ సాధించిన ఘనవిజయంతో టాలీవుడ్ దర్శకనిర్మాతల్లో ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. మనం తీసే సినిమాను సరిగా ప్రొజెక్ట్ చెయ్యగలిగితే కమర్షియల్‌గా సక్సెస్ అవ్వొచ్చు అనే నమ్మకం వారికి కలిగింది. దర్శకుడు రాజమౌళి ఈ విషయంలో ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. ఇప్పుడు దాన్ని అనుసరిస్తూ చాలామంది దర్శకనిర్మాతలు ప్రపంచ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నారు.
ఎప్పుడైతే ‘బాహుబలి’ సినిమా రెండు భాగాలుగా వచ్చి విజయం సాధించిందో అప్పటి నుంచి టాలీవుడ్ దర్శకనిర్మాతలకు, హీరోలకు సీక్వెల్స్ మీద మక్కువ పెరిగింది. ఇక కన్నడలో రూపొంది పలు భాషల్లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ఘనవిజయం సాధించిన ‘కెజిఎఫ్’ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన ‘పుష్ప’ రిలీజ్ టైమ్‌లోనే దానికి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఇప్పుడు టాలీవుడ్‌లో సీక్వెల్స్ హంగామా మొదలైంది. ఒకదాని వెంట మరొకటి అన్నట్టుగా.. తమ సినిమాకి సీక్వెల్ ఉంటుందని దర్శకనిర్మాతలు ప్రకటించేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్‌లో సీక్వెల్స్ సంఖ్య బాగానే పెరిగిపోయింది.
తెలుగులో సీక్వెల్స్‌గా రాబోతున్న సినిమాలను పరిశీలిస్తే.. పుష్ప2 షూటింగ్ దశలో ఉంది. నిన్న మొన్నటి వరకు ఒక భాగంగానే అనుకున్న ‘దేవర’కి సీక్వెల్ ఉంటుందని కొరటాల శివ ప్రకటించాడు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘సలార్’కి కూడా సీక్వెల్ ఉందని మేకర్స్ ముందుగానే ప్రకటించారు. ప్రభాస్ చేస్తున్న మరో సినిమా ‘కల్కి’ సినిమా రెండు లేదా మూడు భాగాలుగా ఉండొచ్చని తెలుస్తోంది. అంతేకాదు, పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఓజి, హరిహర వీరమల్లు సినిమాలకు కూడా సీక్వెల్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అలాగే ఈ సీక్వెల్స్ లిస్ట్‌లో హీరో విజయ్ దేవరకొండ కూడా చేరిపోయాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ చేసే సినిమాకి కూడా సీక్వెల్ ఉంటుందట. రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన సూపర్‌హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇవి కాక డిజెటిల్లు, గూఢచారి, అఖండ, స్కంద వంటి సినిమాలు సీక్వెల్స్‌లో రాబోతున్నాయి. నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయకి సీక్వెల్ రానే వచ్చింది. ఇప్పుడు మూడో పార్ట్ కూడా రాబోతోంది.
సాధారణంగా తెలుగు సినిమాల నిడివి రెండు నుంచి రెండున్నర గంటలు ఉంటుంది. ఈ నిడివిలో దర్శకుడు అనుకున్న కథని చెప్పడానికి వీలు పడనప్పుడు తప్పని సరి అయితే రెండో భాగం చేయాలనుకోవడం జరుగుతుంది. కానీ, ఇప్పుడు సీక్వెల్స్‌గా రాబోతున్న సినిమాలను చూస్తుంటే.. ప్రతి సినిమాకీ సీక్వెల్ అవసరమా అనే ప్రశ్న వినిపిస్తోంది. ఒక సినిమా సూపర్‌హిట్ అయ్యిందంటే దానికి రెండో భాగం చెయ్యాలనుకోవడంలో అర్థం ఉంది. అసలు మొదటి భాగమే రిలీజ్ అవ్వకుండా ఆ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించడంలో అర్థం లేదన్న వాదన వినిపిస్తోంది. కేవలం మిగతా హీరోల సినిమాలన్నీ సీక్వెల్స్‌గా వస్తున్నాయి కాబట్టి మన సినిమాకీ సీక్వెల్ చేసేద్దాం అని హీరోలు, దర్శకనిర్మాతలు ముందుకెళ్తున్నారని అర్థమవుతోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న మరో విషయం ఏమిటంటే.. ప్రస్తుతం తాము చేస్తున్న సినిమాలకు హైప్ తీసుకొచ్చేందుకు ఈ సీక్వెల్ ట్రిక్ ఉపయోగిస్తున్నారట. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫలితాన్ని బట్టి కమర్షియల్‌గా వర్కవుట్ అవుతుంది అనిపిస్తే తప్ప సీక్వెల్ జోలికి వెళ్ళే అవకాశాలు తక్కువని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో.. ఈ సీక్వెల్స్ ట్రెండ్ ఎంతకాలం నడుస్తుందో చూడాలి.