మలయాళ నటుడు సురేష్‌గోపి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. పోలీస్ ఆఫీసర్‌గా నటించిన పలు సినిమాలు తెలుగులోకి అనువదింపబడి ఘనవిజయాన్ని సాధించాయి. అప్పట్లో సురేష్ గోపి సినిమాల కోసం ఒక వర్గం ప్రేక్షకులు ఎదురుచూసేవారు. ఆ తర్వాత సురేష్ గోపి రాజకీయాల్లో కూడా ప్రవేశించి రాజ్యసభ ఎంపిగా కూడా పనిచేశారు. ఇదిలా ఉంటే సురేష్ గోపి కుమార్తె భాగ్య వివాహం శ్రేయాస్ మోహన్‌తో జనవరి 17న కేరళలోని త్రిసూర్ జిల్లా గురువాయూర్‌లోని శ్రీకృష్ణుని ఆలయంలో జరిగింది. ప్రధానమంత్రి నరేంద్రమోది రెండు రోజులపాటు కేరళ పర్యటనలో ఉన్నారు. ఆ క్రమంలోనే సురేష్ గోపి కుమార్తె వివాహానికి హాజరై వధూవరులకు పూల దండలను అందించారు. మోది సమక్షంలోనే వారు పెళ్లి చేసుకున్నారు.
ఈ వివాహానికి మలయాళ స్టార్ హీరోలు మోహన్‌లాల్, మమ్ముట్టితోపాటు జయరాం, దిలీప్, జయరాం, ఖుష్బూ వంటి తారలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం గురువాయూర్ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి తామర మొగ్గలతో తులాభారం నిర్వహించారు ప్రధాని మోది. అంతేకాకుండా అదే సమయంలో వివాహం చేసుకుంటున్న మరో పది జంటలకు శుభాకాంక్షలు తెలిపారు.