దిశ, ఫీచర్స్ : సంతోషం సగం బలం అంటుంటారు. ఎవరైతే తమ జీవితంలో ఎక్కువ భాగం ఆనందంగా ఉంటారో వారు ఆరోగ్యంగానూ ఉంటారు. మిగతా వారితో పోల్చితే ఆయుష్షు కూడా వీరికి ఎక్కువేనని గత అధ్యయనాలు పేర్కొన్నాయి. అందుకే ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండేందుకు ప్రయత్నించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. పెద్దలు, నిపుణులు కూడా అదే సలహా ఇస్తుంటారు. వాస్తవానికి హ్యాపీనెస్ అనేది బజార్లో దొరికే వస్తువు కాదు. ఒకరు బోధిస్తేనో, ఒకరివల్ల పొందేదిగానో అంతకంటే కాదు. కొన్నిసార్లు ఇతరులవల్ల తాము సంతోషంగా ఉన్నామని అనిపించవచ్చు. కానీ అది తాత్కాలికమేనని, హృదయాంతరాల్లోంచి ఫీలయ్యేది మాత్రమే అసలైన ఆనందమని నిపుణులు అంటున్నారు. అలాగే ఇది వ్యక్తిగతమైన, సామాజిక పరమైన అంశాలతో కూడా ముడిపడి ఉంటుంది. ఒక వ్యవస్థలో సానుకూలమైన మార్పులు కూడా ప్రజల సంతోషానికి కారణం అవుతాయి.
మొదటి స్థానంలో ఫిన్లాండ్
నేడు వరల్డ్ హ్యాపీనెస్ డే సందర్భంగా దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి డిస్కషన్ నడుస్తోంది. తాజాగా యూఎన్ ఆధారిత అనుబంధ సంస్థ ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉండే 143కి పైగా దేశాల జాబితాను కూడా రిలీజ్ చేసింది. దీని ప్రకారం.. ఎక్కువ సంతోషంగా ఉండగలిగే దేశాల జాబితాలో ఫిన్లాండ్ వరుసగా 7వ సారి మొదటిస్థానంలో నిలిచింది. ఇక డెన్మార్క్ రెండవ స్థానాన్ని, ఐస్‌లాండ్ మూడవ స్థానాన్ని దక్కించుకోగా భారతదేశం 126వ స్థానంలో నిలిచింది. చైనా 60వ స్థానంలో, నేపాల్ 95 స్థానంలో, పాకిస్థాన్ 108వ స్థానంలో, మయన్మార్ 118వ స్థానంలో నిలిచాయి. అయితే ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేస్‌లో నిలవడం అందరినీ ఆకట్టుకుంటోంది. అక్కడి ప్రజలు ఎందుకని సంతోషంగా ఉంటున్నారో తెలసుకోవడానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు.
అసలు కారణం ఇదే..
ప్రపంచంలో కెల్లా ఫిన్లాండ్ ప్రజలు సంతోషంగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా వారి జీవన విధానం ప్రకృతితో చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటుందని, వర్క్ అండ్ లైఫ్ మధ్య సమతుల్యతను పాటించడంలో ఇక్కడి ప్రజలు ముందుంటారని యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకీకి చెందని రీసెర్చర్స్ పేర్కొంటున్నారు. అంతే కాకుండా ఇక్కడి ప్రభుత్వ విధానాలు ప్రజల జీవితాల్లో ఆర్థిక అసమానతలు తొలగించే విధంగా ఉంటాయట. ప్రతి ఒక్కరికీ ఉపాధి, ఉద్యోగం వంటివి లభిస్తుంటాయి. అలాగే సామాజిక అంశాలపై అవగాహనతో ఉంటారు. మానసిక ఒత్తిడి, ఆందోళనలు వంటివి చాలా తక్కువ. ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి లేకపోవడం, ఉచిత విద్య, వైద్యం వంటివి అందరికీ లభించడం కూడా ఫిన్లాండ్ ప్రజల సంతోషానికి కారణం అవుతున్నాయి.