ప్రభాస్ (Prabhas) తాజా చిత్రం ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) కుటుంబంతో కలిసి ‘కల్కి’ చిత్రాన్ని వీక్షించడమే కాకుండా.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా అంటూ సుదీర్ఘ ట్వీట్ చేశారు.
“ఈ రోజు ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమాను కుటుంబ సమేతంగా కలిసి చూడటం జరిగింది. మహాభారతాన్ని.. భవిష్యత్ కాలాన్ని సమ్మిళితం చేస్తూ.. దర్శకుడు నాగ్ అశ్విన్ అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. సినిమాలో లెజెండ్రీ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే వంటి తారాగణం అద్భుతంగా నటించారు. టాలీవుడ్ లో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనీదత్, స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఓ విజువల్ వండర్. ఈ సినిమా మరింత అద్భుతంగా విజయవంతం కావాలని.. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. సినిమాలు విజయవంతం అయితే.. పరిశ్రమ పచ్చగా ఉంటుంది.. లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. ప్రతీ ఒక్కరు పౌరాణిక, ఆధునిక అంశాల కలయికలో వచ్చిన ఈ ‘కల్కి 2898 AD’ వంటి అద్భుతమైన సినిమాను చూడాలని సినిమాటోగ్రఫీశాఖ మంత్రిగా కోరుకుంటున్నాను.” అంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ట్వీట్ చేశారు.