రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) క్రేజ్ ఖండాంతరాలు దాటింది. ‘బాహుబలి’ నుంచి ఆయన సినిమాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురు చూసే రోజులు వచ్చాయి. ముఖ్యంగా జపాన్ లో ప్రభాస్ ని అభిమానించేవారు ఎందరో ఉన్నారు. తెలుగు ప్రేక్షకులు ఎలాగైతే డార్లింగ్ సినిమాలను సెలెబ్రేట్ చేసుకుంటారో.. వారు కూడా అలాగే సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.
ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) జూన్ 27న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. మొదటి నుంచి ప్రమోషన్స్ విషయంలో భిన్నంగా వ్యవహరిస్తున్న మూవీ టీం.. సినిమా విడుదల తర్వాత దానినే ఫాలో అవుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ వద్ద కల్కిలో ఉపయోగించిన వాహనాలను ప్రదర్శనకు ఉంచుతున్నారు. ఇటీవల ‘బుజ్జి’ వెహికిల్ ని ఉంచగా, ఇప్పుడు రెబల్ ట్రక్ ను ఉంచారు. అయితే ట్రక్ ముందు జపాన్ అభిమానులు కల్కి జెండా ఫొటో దిగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫొటో చూసిన ప్రభాస్ అభిమానులు.. ఈ జపానోళ్లు మనకంటే వీరాభిమానుల్లాగా ఉన్నారంటూ మురిసిపోతున్నారు.