పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్ లో రానున్న మూవీ ‘స్పిరిట్’ (Spirit). ఈ మూవీ ఇంకా స్టార్ట్ కూడా కాలేదు. కేవలం ప్రకటనతోనే అంచనాలు ఓ రేంజ్ లో నెలకొన్నాయి. ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ ఇటీవల ఒక న్యూస్ వినిపించింది. అదేంటంటే ఈ సినిమాలో విలన్ గా కొరియన్ స్టార్ ‘మా డాంగ్ సియోక్’ విలన్ గా నటించనున్నాడని. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది.
రీసెంట్ గా ఒక ప్రభాస్ అభిమాని సోషల్ మీడియా వేదికగా.. స్పిరిట్ లో విలన్ గా మా డాంగ్ సియోక్ నటిస్తే బాగుంటుందని, ప్రభాస్ తో అతను తలపడితే అదిరిపోతుందని అభిప్రాయపడ్డాడు. ఆ పోస్ట్ అలా అలా చక్కర్లు కొడుతూ.. “స్పిరిట్ లో విలన్ గా మా డాంగ్ సియోక్ ఎంపిక” అని న్యూస్ లా మారిపోయింది. అయితే ప్రభాస్, సందీప్ రెడ్డి సన్నిహిత వర్గాలు మాత్రం ఈ వార్తని ఖండిస్తున్నాయి. ప్రభాస్ కాకుండా ఈ సినిమా కోసం ఏ ఇతర యాక్టర్ ని ఫైనల్ చేయలేదని చెబుతున్నారు.
‘స్పిరిట్’ని ఇంటర్నేషనల్ వైడ్ గా చైనీస్, జపనీస్, కొరియన్ వంటి భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా కోసం ఇంటర్నేషనల్ వైడ్ గా గుర్తింపు ఉన్న పలువురు ప్రముఖ నటీనటులను రంగంలోకి దింపే అవకాశముంది. ‘మా డాంగ్ సియోక్’ వంటి స్టార్ల పేర్లు పరిశీలనలో ఉన్నా ఆశ్చర్యంలేదు. అయితే ప్రస్తుతానికైతే ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు అనేది సన్నిహితవర్గాల మాట.