Australian Open 2024: ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‍స్లామ్ టోర్నీలో కొత్త ఛాంపియన్ అవతరించాడు. ఇటలీ యువ సంచలనం జానిక్ సిన్నెర్ ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. తన కెరీర్లో తొలి గ్రాండ్‍స్లామ్ టైటిల్ సాధించాడు 22ఏళ్ల సిన్నెర్. మెల్‍బోర్న్ వేదికగా నేడు (జనవరి 28) జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‍లో నాలుగో సీడ్ జానిక్ సిన్నెర్ 3-6, 3-6, 6-4, 6-4, 6-3 తేడాతో రష్యా స్టార్ ప్లేయర్, మూడో సీడ్ డానిల్ మెద్వెదేవ్‍పై గెలిచాడు. తొలి రెండు సెట్లు కోల్పోయి ఓ దశలో సిన్నెర్ ఓటమి అంచుల్లో నిలిచాడు. అయితే, ఆ తర్వాత విజృంభించిన సిన్నెర్.. వరుసగా మూడు సెట్లు కైవసం చేసుకొని ఫైనల్‍లో సంచలన విజయం సాధించాడు.