గోధుమ మొలకలను తీజ్‌గా పిలుస్తారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం బుట్టల్లో నీళ్లుపోస్తారు. ఈ తొమ్మిదిరోజుల పాటు యువతులు ప్రత్యేక ఉపవాసాలతో గడుపుతారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ప్రతి బంజారా తండాల్లో తీజ్ పండుగ ఘనంగా నిర్వహించుకుంటున్నారు.
దిశ, నాగార్జునసాగర్: గిరిజన తండాలలో అవివాహిత ఆడపిల్లలు ప్రత్యేకంగా జరుపుకునే పండుగ తీజ్. కాలం మారుతున్నా లంబాడీలు మాత్రం తమ సంస్కృతిని, సంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఆధునిక ప్రపంచంలోనూ తమ సంప్రదాయాలను కాపాడుకుంటూ ప్రతి ఏటా తీజ్ ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటున్నారు గిరిజనులు. ఏటా శ్రావణమాసంలో లంబాడాతండాల్లో తొమ్మిది రోజులపాటు తీజ్ ఉత్సవాలు సందడిగా నిర్వహిస్తుంటారు. తీజ్ ఉత్సవాలు వేడుకలపై ‘దిశ’ ప్రత్యేకకథనం…
తండాల్లో తీజ్ పండుగ ప్రత్యేకత
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని అధికంగా కలిగిన బంజారాల తీజ్ పండుగ అంటేనే బంజారాల సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉంటుంది. ఈ పండుగ ప్రారంభించడానికి ముందు బంజారాల గ్రామాల్లో , తండాల్లో ఆడపిల్లలంతా కలిసి ఇంటింటికీ తిరిగి గ్రామంలోని పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. ఉత్సవాలు నిర్వహించడానికి ఊరి పెద్ద నాయక్, కార్బారిలా చర్చించి పండుగను ప్రారంభిస్తారు. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు పండుగ ప్రారంభం అవుతుంది. మొత్తం తొమ్మిది రోజులపాటు పండుగ వేడుకలు జరుపుకుంటారు. ముందుగా ఉత్సవాలకు కావాల్సిన గోధుమలు, శనగలు, ఇతర సామగ్రి సమకూరుస్తారు. ఆడపిల్లల కోసం వారి సోదరులు ఇంటి వద్దనే బుట్టలను అల్లుతారు. దీనికి అడవిలో దొరికే దుసేరు తీగను తీసుకొచ్చి, పుట్టమట్టి సేకరించి అందులో తుల్జాభవాని, దండియాడి, సేవాబాయా, సీతలా భవాని పేర్లతో బట్టలను తయారు చేస్తారు. అలా తయారు చేసిన బుట్టల్లో మొదటగా తండా నాయకుడితో పుట్టమట్టిని బుట్టలలో వేయిస్తారు. ఆ తర్వాత నానబెట్టిన గోధుమగింజలు ఆ బుట్టలో చల్లిస్తారు. ఈ సందర్భంగా ‘‘శీతా యాడి పరాయి తీజ్, బాయీ తారో పాలేణా .. నెరో డాక్లో ఘలాన, బాయీ తారో పాలేణా” అనే పాటలు పాడుతూ పూజా కార్యక్రమాలు మొదలు పెడతారు.
పాటలు పాడుతూ, సంప్రదాయ నృత్యాలతో తండాలు ఆనందమయం
ఖొదా ఖొదారే సేవాభాయ కువలో ఖొదా..
కువలేరో పాణి అకేలా భీ భరే సకేలా భీ భరే..”
లాంబి లాంబియే లాంబడి ఎకేరియా .
ల్యార లేరియే లాంబడి ఎకేరియా..
ధోక ఖారియే లాంబడి ఎకేరియా .
లాంబి లాంబియే లాంబడి ఎకేరియా..”
అంటూ భక్తిగా పాడే బంజారాల జీవనంలో సేవలాల్ మహారాజ్ తెచ్చిన క్రాంతి సాంస్కృతికంగా, ధార్మికంగా వారి జీవితాలను ఏ విధంగా ఉన్నతంగా మలచిందో ఈ పాట తెలియజేస్తుంది. బంజారాల పండుగల్లో పవిత్ర స్థానం ఉంది. బంజారాలకు ఏడుగురు స్ర్తీ దేవతలు ఉన్నారు. వారి పేర్లు మేరమ్మ, హింగ్లా, తోల్జ, సీత్ల, ద్వాలంఘర్, కేంకళి, మంత్రాల్. బంజారా ఆడ పిల్లలు ప్రధాన పాత్రధారులుగా ఉండి జరిపే పండగ తీజ్. పెళ్లీడు వచ్చిన అమ్మాయిల నాయకత్వంలో మిగతా అమ్మాయిలు కలసి భక్తిశ్రద్ధలతో ఈ పండుగను ఎంతో సంబరంగా జరుపుకుంటారు.
తొమ్మిదిరోజుల పాటు కఠిన నియమాలు
ఈ తొమ్మిది రోజుల అమ్మాయిలకు కఠిన నియమాలు ఉంటాయి. ఉప్పు, కారం లేని భోజనం తినాలి. అత్యంత పవిత్రంగా ఉండాలి. భక్తితో దేవతలను పూజించాలి. తండా నుంచి బయటకు వెళ్లకూడదు. మాంసం నిషేధం. బావి నుంచి నీటిని తెచ్చే బిందెను నేలపై పెట్టకుండా నేరుగా పందిరిపై నీరు పోయాల్సిందే. నృత్యాలు చేసినంత సేపు బిందెను నెత్తిపై పెట్టుకొని నిలబడాల్సిందే. తొమ్మిదిరోజులపాటు రోజుకో పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. నానబెట్టిన శనగలను రేగిముళ్లను గుచ్చే ఒక విలక్షణమైన ఆచారాన్ని బోరడిఝుష్కేరో పేరుతో పిలుస్తారు. గోధుమలను బుట్టలో చల్లడం సాయంత్రం నిర్వహిస్తారు. పెండ్లికాని ఆడపిల్లలు రేగిముళ్లకు శనగలు గుచ్చుతుంటే వారికి బావ వరుస అయినవారు ముళ్లను కదిలిస్తారు. అయినా అమ్మాయిలు సహనంతో శనగలను ముళ్లకు గుచ్చాల్సి ఉంటుంది. తీజ్ ఎంత ఏపుగా, పచ్చగా పెరిగితే తమకు నచ్చిన జీవితభాగస్వామి వస్తారని విశ్వసిస్తారు. ఏడో రోజు రొట్టెలు, బెల్లం కలిపిన ముద్దను మేరామ అమ్మవారికి సమర్పిస్తారు. ఎనిమిదో రోజు బంజారుల ఆరాధ్యదేవతల ప్రతిరూపాలను మట్టితో చేసి పూజిస్తారు. తొమ్మిది రోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తూ ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మొలకలకు నీళ్లు పోస్తూ పూజలు చేస్తారు. చివరిరోజు నిమజ్జనం కనుల పండువగా నిర్వహిస్తారు.
వివిధ ప్రాంతాల్లో ఉండే తమ బంధువులను ఆహ్వానిస్తారు. మొలకల బుట్టలను ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యువతులు తీజ్‌ను తలపై పెట్టుకుంటారు. తీజ్‌ను పెద్దల తలపాగాలో ఉంచి ఆశీర్వాదాలు తీసుకుంటారు.అలా తొమ్మిది రోజుల్లో గోధుమ నారు ఏపుగా పెరుగుతుంది. అలా బుట్టల్లో గోధుమ మొలకలను పెంచి, వాటి చట్టూ ఆడిపాడి, తొమ్మిదోరోజు వాగులో నిమజ్జనం చేస్తారు. వర్షాలు సంవృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ఊరంతా బాగుండాలని, మంచి మొగుడు రావాలని కోరుకుంటూ, అంతరించి పోతున్న గిరిజన సంస్కృతిని అపూర్వంగా కాపాడుకోవడానికి అడవి బిడ్డలు ప్రతి ఏటా తీజ్ పండుగను భక్తిగా జరుపుతున్నారు. తీజ్‌బుట్టలను తలపై ఉంచుకొని డప్పుచప్పుళ్లతో సంప్రదాయబద్ధంగా నృత్యాలు చేస్తూ ఆటాపాటలతో బయలుదేరి చెరువుల్లో తీజ్‌ను నిమజ్జనం చేస్తారు.