ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప: ది రూల్’ మూవీ చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఆ తర్వాత డైరెక్టర్స్ త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాతో సినిమాలు కమిటై ఉన్నాడు. ‘పుష్ప-2’ ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. అయితే త్రివిక్రమ్, సందీప్ రెడ్డి సినిమాలు స్టార్ట్ కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో.. ఈ గ్యాప్ లో మరో సినిమా పూర్తి చేయాలని బన్నీ భావిస్తున్నట్లు ఆమధ్య వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో పలువురు దర్శకుల పేర్లు వినిపించాయి. ముఖ్యంగా డైరెక్టర్ అట్లీ పేరు ప్రముఖంగా వినిపించింది. తాజాగా బన్నీ-అట్లీ ప్రాజెక్ట్ కి సంబంధించి క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.
అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ మూవీ ఓకే అయినట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ చిత్రాన్ని బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ప్రకటించనున్నారని సమాచారం. ఈ ఏడాది చివరిలో షూటింగ్ స్టార్ట్ కానుందట. వచ్చే ఏడాది పాన్ ఇండియా రేంజ్ లో భారీస్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
‘జవాన్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అట్లీ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. అందుకే ఈ సినిమా కోసం ఏకంగా రూ.60 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు టాక్. ఇక ‘పుష్ప’తో పాన్ ఇండియా స్టార్ గా మారిన బన్నీ ఈ సినిమా కోసం రూ.120 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోనున్నాడట. అంటే హీరో, డైరెక్టర్ రెమ్యూనరేషన్ కలిపితే ఏకంగా రూ.180 కోట్లు. ఇక ఇతర నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యూనరేషన్లు కూడా కలిపితే.. కేవలం పారితోషికాలకే రూ.300 కోట్లు అవుతుంది. ఈ లెక్కన ఈ సినిమా బడ్జెట్ కనీసం రూ.500 కోట్లు అయ్యే అవకాశముంది.