posted on Jul 4, 2024 9:30AM
శరీరానికి పోషకాలు ఎంతో అవసరం. అయితే ఈ పోషకాల విషయానికి వస్తే, చాలా మందికి ఐరన్, కాల్షియం, ప్రోటీన్ లేదా ఫైబర్ గురించి మాత్రమే తెలుసు. ఇవన్నీ శరీరానికి చాలా అవసరం. కానీ వీటికంటే ప్రభావవంతమైనది, శరీరానికి తప్పనిసరిగా కావాల్సినది మరొకటి ఉంది, ఇది శరీరం మెరుగైన పనితీరుకు అవసరం. ఇది లోపిస్తే శరీరం అంతా నీరసంగానూ, ఏ చిన్న పనిచేసినా అలసటగానూ అనిపిస్తుంది. ఎన్ని పోషకాలు తీసుకున్నా, ఎంత బలవర్థకమైన ఆహారం తీసుకున్నా ఈ ఒక్కటి తక్కువై శరీరం నిలదొక్కుకోలేదు. అంతటి శక్తివంతమైన పదార్థం మెగ్నీషియం. మెగ్నీషియం కేవలం శారీరక బలానికే కాదు అనేక మానసిక భావోద్వేగాలకు కూడా ఇది ఎంతో అవసరం. ఇది శరీరంలో కండరాలను నిర్మించడానికి నరాలను ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది.
శరీరంలో మెగ్నీషియం లోపం ఏర్పడితే కండరాల తిమ్మిరి, నరాల బలహీనత, కండరాలు మెలితిప్పినట్లు, శరీరంలోని వివిధ ప్రాంతాల్లో తిమ్మిరి లేదా జలదరింపు వంటి అనేక లక్షణాలను కనిపిస్తాయి. శరీరంలో మెగ్నీషియం లోపం ఎన్నో కారణాల వల్ల ఏర్పడుతుంది. విటమిన్ డి లోపం వల్ల మెగ్నీషియం లోపిస్తుంది, యాంటాసిడ్‌ల మితిమీరిన వినియోగం, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం, తీవ్రమైన విరేచనాలు, ఆహారంలో తక్కువ మెగ్నీషియం గల ఆహారాలను చేర్చకపోవడం వంటి అనేక కారణాల వల్ల శరీరంలో ఈ ముఖ్యమైన మూలకం లోపం ఏర్పడుతుంది. ఇది మాత్రమే కాకుండా, గర్భధారణ సమయంలో మెగ్నీషియం లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. మెగ్నీషియం లోపాన్ని నివారించడానికి ఆహారంలో మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. ఈ కింది ఆహారాలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.
బాదంపప్పులో మెగ్నీషియం ఉంటుంది. 10గ్రాముల బాదం పప్పులో రోజువారీ శరీరానికి కావలసిన మెగ్నీషియంలో 20% (76 mg) లభిస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, మెగ్నీషియం శరీరానికి అందడానికి ప్రతిరోజూ కొన్ని బాదంపప్పులను తినడం మంచి మార్గం. గుమ్మడికాయ గింజలలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. చాలా మంది తమ ఆహారం ద్వారా మెగ్నీషియం తగినంతగా పొందలేరు. ప్రతి 100 గ్రాముల గుమ్మడికాయ గింజల్లో 262 మిల్లీగ్రాముల వరకు మెగ్నీషియం ఉంటుంది. ప్రతిరోజూ కొన్ని గుమ్మడి గింజలు తింటూ ఉంటే ఈ లోపాన్ని భర్తీ చేయవచ్చు.
అరటిపండ్లు ఎముకలను బలపరిచే పొటాషియం అధికంగా ఉండే పండు. ఒక మధ్యస్థ అరటిపండు 10.3 mg విటమిన్ సి, 32 mg మెగ్నీషియంను అందిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది.
పాలకూర అందరికీ అందుబాటులో ఉంటే ఆకుకూర. పాలకూరలో మెగ్నీషియం మాత్రమే కాదు ఐరన్ కూడా సమృద్దిగా ఉంటుంది. కాబట్టి ఐరన్, మెగ్నీషియం లోపంతో ఇబ్బంది పడేవారు పాలకూరను తప్పనిసరిగా తీసుకోవాలి.
జీడిపప్పులో కూడా మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కాకుండా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా జీడిపప్పులో ఉంటాయి. ప్రతిరోజూ కాసింత జీడిపప్పు తీసుకోవడం వల్ల ఇది మెగ్నీషియంతో పాటు, ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు కూడా పొందవచ్చు. ఇవి కాకుండా, వోట్మీల్, బ్రౌన్ రైస్, వేరుశెనగ నూనె, చియా గింజలు, బీన్స్‌లో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.