ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల కేవలం శ్వేత పత్రాల విడుదలకే సమయాన్ని కేటాయించారు. బాబు వ్యూహం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నికల్లో జగన్ ఓడిపోయినప్పటికీ, శాశ్వతంగా ఆయన్ను దోషిగా రాష్ట్ర ప్రజానీకం ఎదుట నిలబెట్టాలనేది ఆయన ఎత్తుగడ. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదనే సంగతి తెలియంది కాదు. అయితే జగన్ అంటే జనం భయపడేలా చేసి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల్లో ఎప్పటికీ గెలవకుండా చేయాలనే వ్యూహంలో భాగంగా చంద్రబాబు శ్వేత పత్రాల విడుదల తంతుకు శ్రీకారం చుట్టారనేది బహిరంగ రహస్యమే.
ఈ నేపథ్యంలో శ్వేతపత్రాలన్నింటికీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమాధానం చెబితే బాగుంటుందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. బాబు చెబుతున్నవన్నీ అబద్ధాలే అని జగన్ సొంత పత్రిక, అలాగే వైసీపీ నాయకులు విమర్శించడం వరకే పరిమితం కాకూడదు. జగనే మీడియా ముందుకొచ్చి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తే ప్రజలకు నాణేనికి రెండో కోణం చూపినట్టు అవుతుందని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.
శాంతిభద్రతలు, ఇసుక, సాగు, తాగునీరు, సంక్షేమ పథకాల అమలు తదితర వాటికి సంబంధించి చంద్రబాబు చెప్పింది ఏంటి? అందులోని నిజానిజాలేంటో జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు సిద్ధమవుతున్నారనే మాట వినిపిస్తోంది. ఎటూ అసెంబ్లీకి వైసీపీ వెళ్లే పరిస్థితి లేదు. ఒకవేళ వెళ్లినా అక్కడ మాట్లాడ్డానికి మైకు ఇచ్చేది కూడా ఉండదు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో ఐదారు నిమిషాలకు మించి జగన్‌కు మాట్లాడ్డానికి సమయం ఇవ్వరు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు చెప్పింది మాత్రమే కాకుండా, ఐదేళ్ల తన పాలనలో ఏం జరిగిందో జగన్ ఇప్పటికైనా చెప్పుకోవాల్సిన అవసరం వుంది. జగన్ అంటే విధ్వంసకారుడిగా చిత్రీకరించడంలో చంద్రబాబు కొంత వరకు విజయం సాధించారు. చంద్రబాబు నెలన్నర పాలన గురించి జగన్ సమగ్రంగా జనానికి చూపితే చాలు, ఆయనంటే భయపడిపోతారనే అభిప్రాయం వైసీపీ నుంచి వ్యక్తమవుతోంది.
The post బాబుకు జగన్ కౌంటర్ ఇస్తారా? appeared first on Great Andhra.