త‌న మాజీ బాస్ చంద్ర‌బాబుపై విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని నిత్యం విరుచుకుప‌డుతున్నారు. విజ‌య‌వాడ లోక్‌స‌భ స్థానానికి నాని లాంటి బ‌ల‌మైన నాయ‌కుడు వైసీపీకి దొర‌క‌డాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. త‌న‌ను అవ‌మానించార‌నే ఆవేద‌న నానిలో వుంది. ఈ ద‌ఫా టీడీపీకి గ‌ట్టిగా బుద్ధి చెప్పాల‌ని ఆయ‌న ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. వైసీపీలో అధికారికంగా చేర‌గానే కేశినేనికి విజ‌య‌వాడ లోక్‌స‌భ స్థానాన్ని కేటాయించ‌డం విశేషం.
ఈ నేప‌థ్యంలో ఎన్టీఆర్ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని ఆయ‌న‌కు కేశినేని త‌న కార్యాల‌యంలో ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. కేశినేని మాట్లాడుతూ చంద్ర‌బాబు త‌ల‌కిందులుగా త‌ప‌స్సు చేసినా అధికారంలోకి రార‌ని తేల్చి చెప్పారు. తెలుగు ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వం కోసం పోరాడిన నాయ‌కుడు ఎన్టీఆర్ అని ఆయ‌న కీర్తించారు. ఆ త‌ర్వాత పేద‌ల సంక్షేమం కోసం పాలించిన ఘ‌న‌త దివంగత వైఎస్సార్‌కు ద‌క్కుతుంద‌ని కేశినేని అన్నారు.
ఎన్టీఆర్‌, వైఎస్సార్ బాట‌లో సీఎం జ‌గ‌న్ ప‌య‌నిస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌శంసించారు. వాళ్లిద్ద‌రి కంటే జ‌గ‌న్ మ‌రింత‌గా మంచి పేరు తెచ్చుకుంటార‌ని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. చంద్ర‌బాబును ప్ర‌జ‌లు ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేద‌న్నారు. ఆయ‌న అధికారంలోకి రార‌ని అన్నారు. కేవ‌లం త‌న కుమారుడిని సీఎం చేసుకోవ‌డ‌మే చంద్ర‌బాబు ల‌క్ష్య‌మ‌ని కేశినేని విమ‌ర్శించారు.
కేశినేని టీడీపీకి వ్య‌తిరేకంగా ప‌లువురు నాయ‌కుల్ని స‌మీక‌రించే ప‌నిలో ప‌డ్డారు. కేశినేనికి క‌మ్మ సామాజిక వ‌ర్గంలో కొంత వ‌ర‌కు ప‌ట్టు వుంది. వివిధ సామాజిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన నాయ‌కుడికి ఆయ‌న‌పై ప్ర‌జాద‌ర‌ణ వుంది. అందుకే ఆయ‌న వైసీపీలో చేర‌డంతో టీడీపీ భ‌య‌ప‌డుతోంది.