కేంద్ర ప్రభుత్వం మంగళవారం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. ఇటీవల చంద్రబాబునాయుడు పలుమార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తదితర కేంద్ర పెద్దల్ని కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో వుందని, ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లపై హామీలు అమలు చేయాల్సిన అతిపెద్ద బాధ్యత వుంది.
కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటే తప్ప, రాష్ట్ర బండి ముందుకు నడవని దయనీయ స్థితి. కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని గవర్నర్ ప్రసంగంలో కూడా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థికంగా ఆదుకుంటుందనే చర్చకు తెరలేచింది. మోదీ సర్కార్ టీడీపీ, జేడీయూ మద్దతుతో ఏర్పాటైన సంగతి తెలిసిందే. దీంతో కేంద్రంలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ప్రాధాన్యత విపరీతంగా పెరిగిందని కూటమి అనుకూల మీడియా కొంత కాలంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.
ప్రధాని మోదీ, అమిత్‌షా, నిర్మలా సీతారామన్‌లతో తనకు మంచి సంబంధాలున్నాయని, నిధులు రాబడుతానని పవన్‌కల్యాణ్ కూడా పలు సందర్భాల్లో చెప్పారు. అందుకే రాష్ట్రానికి నిధులు ఇవ్వడమా? ఇవ్వకపోవడమా? అనేది చంద్రబాబు, పవన్‌కల్యాణ్ పలుకుబడిపై ఆధారపడి వుందనే చర్చకు తెరలేచింది. నిజంగా వీళ్లిద్దరికి కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద పలుకుబడి వుంటే, నిధులు ఏపీకి వెల్లువెత్తుతాయి. లేదంటే ఎప్పట్లాగే మొక్కుబడిగా సరిపెడతారు.
చంద్రబాబు చాణక్యుడిలాంటి వారు. ఆయనకు ఆంజనేముడిలాంటి వీరభక్త ఉప ముఖ్యమంత్రి వెన్నంటి ఉన్నారు. వీళ్లిద్దరూ కోరితే కేంద్ర ప్రభుత్వం కాదనేది ఏదీ వుండదని టీడీపీ అనుకూల ప్రచారంలో నిజం ఎంతో …కొన్ని గంటల్లో ప్రవేశ పెట్టే బడ్జెట్ తేల్చనుంది. నిధుల్ని భారీగా రాబడితే మాత్రం చంద్రబాబు, పవన్‌ను సన్మానించాల్సిందే.
The post బాబు, పవన్ పలుకుబడికి పరీక్ష! appeared first on Great Andhra.