Top Stories

బాబు ప్రాణానికి ముప్పు.. వైసీపీ హత్య చేసుకున్నట్లే..!


టీడీపీ అధినేత తన ప్రాణాలకు ముప్పు ఉందని ఏసీబీ కోర్టు జడ్జికి సుదీర్ఘమైన లేఖ ఒకటి రాసారు. ఈ లేఖ అక్టోబర్ 25 డేట్ మీద బయటకు వచ్చింది. జైలు అధికారుల ఆమోదముద్రతో రిలీజ్ అయింది. ఈ లేఖలో బాబు తనను అంతమొందించేందుకు భారీ ఎత్తున కుట్ర సాగుతోందని చెప్పుకున్నారు. తన కదలికలను జైలులో కొంతమంది అసాంఘిక శక్తులు పెన్ కెమెరాతో చిత్రీకరిస్తున్నారని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.

తనను మావోయిస్టులతో పాటు అసాంఘిక శక్తులతో ప్రమాదం పొంచి ఉందని బాబు సందేహం వ్యక్తం చేశారు. ఇక బాబు తాను ప్రతిపక్షంలో ఉంటూ ఏపీలో పర్యటించిన అనేక సందర్భాలలో సైతం తన కాన్వాయ్ మీద రాళ్ల దాడి జరిగిందని కూడా గుర్తు చేశారు. ఏపీలో ఉన్న అధికార పార్టీ మీదనే బాబు ఆరోపణలు చేసినట్లుగా కనిపిస్తోంది.

అయితే లేఖ రాయడం మీద ఇపుడు ఒక పెద్ద చర్చ సాగుతోంది. బాబు లేఖ తనను తీవ్రంగా కలతకు గురి చేసిందని ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేస్తే లోకేష్ కూడా తన తండ్రి లేఖ మీద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ శ్రేణులు అయితే ఇదే నిజం అంటున్నాయి.

కానీ ఇక్కడ మాట్లాడుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. బాబు ఉన్నది అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన రాజమండ్రి జైలులో. ఉమ్మడి ఏపీలోనే పూర్తి కట్టుదిట్టమైన జైలుగా దీన్ని చెబుతారు. ఇక ఈ జైలులో బాబు ఉన్నది కూడా జ్యుడీషియల్ కస్టడీలో. అందువల్ల ఆయన భద్రతకు ప్రమాదం ఏ విధంగా ఉంటుంది అన్నది ఒక కీలకమైన ప్రశ్న.

ఇక బాబుని చంపితే లాభం ఎవరికి అన్నది మరో పాయింట్. బాబుకు ఏమైనా జరిగితే ఆ పాపం అంతా పూర్తిగా చుట్టుకునేది వైసీపీకే అన్నది చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. ఇంకా చెప్పాలీ అంటే బాబుని కంటికి పాపలా చూసుకోవాల్సిన కర్తవ్యం పోలీసులది జైలు అధికారులది అయితే దాన్ని పర్యవేక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వారు అదే పని మీద ఉంటారు.

ఇక బాబు ఉన్నది ఒక జైలు గదిలో కాదు, ఏకంగా ఒక బ్లాక్ మొత్తాన్ని ఖాళీ చేసి ఆయనకు ఇచ్చారు. ఆ బ్లాక్ చుట్టూ ఏకంగా ఇరవై నాలుగు సీసీ కెమెరాలను అమర్చారు. అవి నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటాయి. చీమ చిటుక్కుమన్నా కూడా వెంటనే అలర్ట్ అయ్యే పరిస్థితి ఉంది అక్కడ. అంతే కాదు ప్రతీ రెండు రోజులకు డీఐజీ ర్యాంక్ ఆఫీసర్ ప్రత్యక్షంగా బాబు ఉన్న బ్లాక్ కి వెళ్ళి అక్కడ పరిస్థితులను మధింపు చేసుకుని వస్తారు.

బాబుకి అన్ని విధాలుగా రక్షణ అలా లభిస్తోంది. మరి బాబు ఎందుకు అలా ప్రాణాలకు ముప్పు అని అంటున్నారు. అంటే బహుశా ఆయన జైలు గోడల మధ్యన గడచిన యాభై రోజులుగా నలిగి పోతూండడం వల్ల కొంత డీ మోరలైజ్ అయి ఉండవచ్చు అని అంటున్నారు. అంతే కాదు బాబు కేసులు ఒకదానికి ఒకటి లా అన్నీ ముందుకు వస్తున్నాయి. ఆయన జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఎప్పటికపుడు లేట్ అవుతున్నాయి.

ఇంకో వైపు చూస్తే బాబు ఒంటరిగా అన్ని రోజులు గడపడం వల్ల కూడా మానసికంగా కొంత బలహీనంగా కూడా ఉన్నట్లుగా అవుతున్నారు. మరి టీడీపీ నేతలు బాబు ధైర్యంగా ఉన్నారని ఇప్పటిదాకా చెప్పిన మాటల సంగతేంటి అన్న చర్చ అయితే ఉంది. ఇంకో వైపు బాబు ఆరోగ్యానికి ఇబ్బంది అని కోర్టులలో పిటిషన్లు ఆయన తరఫున న్యాయవాదులు వేస్తున్నారు. ఇపుడు తన ప్రాణాలకు ముప్పు అంటూ బాబు లేఖలు రాస్తున్నారు.

ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అన్నది ఒక ప్రశ్నగా ముందుకు వస్తోంది. ఇక ఈ రెండూ కూడా పరస్పరం విరోధంగా కనిపిస్తున్నాయి. బాబుని ఎలాగైనా బయటకు తెచ్చే మార్గాల కోసం అన్వేషణలా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇక బాబు భద్రత గురించి కనుక ఆలోచిస్తే ఈ దేశంలో అత్యంత కట్టుదిట్టమైన జైలు ఒకటి ఉంది. అది తీహార్ జైలు అని చెబుతారు. కోరుకుంటే తీహార్ జైలుకైనా పంపించవచ్చు అని అంటున్నారు. మరి బాబు రాసిన లేఖలో ముప్పు ఉంది అంటే విడుదల చేస్తారా. ఇంకా భద్రత పెంచుతారు తప్ప అన్నది కూడా వినిపిస్తున్న మాట.

అలాగే ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే జైలు అధికారుల సమక్షంలోనే మెరుగైన వైద్యం అందిస్తారు తప్ప వేరే విధంగా ఎందుకు జరుగుతుంది అన్నది కూడా ఆలోచించాలి. ఇక తనను చంపాలని చూస్తున్నారు అని బాబు చెప్పడం కూడా ఆయన ఆలోచనలు ఎలా ఉన్నా వైసీపీ అయినా మరో పార్టీ అయినా అంతటి తెలివి తక్కువ పని అయితే చేయదు అనే అంటారు అంతా.

బాబు ఇపుడు అందరి కంటే అత్యంత ప్రధానమైన వ్యక్తి వైసీపీకి మాత్రమే అని ఎవరైనా చెబుతారు. ఆయన భద్రత ప్రభుత్వం ప్రధమ కర్తవ్యంగా చూస్తారు. ఏది ఏమైనా బాబు ప్రాణాలకు ముప్పు అనడం ద్వారా ఎమోషన్ అయితే టీడీపీతో పాటు కోట్లాది ప్రజలలో కలిగించే ప్రయత్నం అయితే జరుగుతోంది. మరి దీని ఫలితాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.



Source link

Related posts

ప్రియుడి కోసం మరో అక్రమ చొరబాటు

Oknews

స్లిమ్ బ్యూటీ డైట్ సీక్రెట్ ఇదే!

Oknews

కేరాఫ్ బాలయ్య అల్లుడు కాదట…!

Oknews

Leave a Comment