కూటమి అధికారంతో తప్ప, హామీలతో తమకు సంబంధం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇస్తామని ప్రకటించారు. సూపర్ సిక్స్‌తో పాటు జనసేనాని పవన్‌కల్యాణ్ చెప్పిన మరికొన్ని సంక్షేమ పథకాలను కలిపి మ్యానిఫెస్టోను తీర్చిదిద్దారు.
కూటమి మేనిఫెస్టోకు బీజేపీ దూరం వుంది. మ్యానిఫెస్టో అమలు బాధ్యతను తాము తీసుకుంటామని చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఉమ్మడిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సూపర్‌సిక్స్ పథకాల్ని అమలు చేయాలంటే భయమేస్తోందని చంద్రబాబు రెండు రోజుల క్రితం అన్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ సూపర్ సిక్స్ పథకాల్ని అమలు చేయలేరన్నారు. అప్పులు చేయడానికి కూడా వీల్లేనంతగా వైసీపీ ప్రభుత్వం రుణాలు తీసుకొచ్చిందన్నారు.
చంద్రబాబు ఇచ్చే హామీల్ని అమలు చేయలేమనే ఉద్దేశంతోనే కూటమి మ్యానిఫెస్టోలో బీజేపీ భాగస్వామ్యం వహించలేదన్నారు. కూటమి మ్యానిఫెస్టో అమలు చేసే బాధ్యతను చంద్రబాబు, పవన్ తీసుకున్నట్టు ఆయన గుర్తు చేశారు. అలివికాని హామీల విషయంలో బీజేపీ ముందు నుంచి జాగ్రత్త తీసుకుందన్నారు. ప్రస్తుతం మ్యానిఫెస్టో అమలు చేసే పరిస్థితి లేకపోవడం, అందులో తాము భాగస్వామ్యం వహించకపోవడంతో బీజేపీ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
The post బాబు హామీలతో సంబంధం లేదంటున్న బీజేపీ appeared first on Great Andhra.