నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన భారీ చిత్రం ‘భగవంత్ కేసరి’. ఒక డిఫరెంట్ టైటిల్‌తో, బాలకృష్ణను మరింత డిఫరెంట్‌గా ప్రజెంట్ చేస్తూ అనిల్ రావిపూడి చేసిన ఈ సినిమా అక్టోబర్ 19న దసరా కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రంలో బాలకృష్ణ కూతురిగా నటించిన శ్రీలీల సినిమాకి సంబంధించిన విశేషాలు, ఈ సినిమా చేస్తున్నప్పుడు తన అనుభవాలను ఆమె మాటల్లోనే…
‘ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. గ్లామర్ క్యారెక్టర్స్ ఎప్పుడైనా చెయ్యొచ్చు. కానీ, ఒక ఎమోషన్ ఉంటూ నటనకు ప్రాధాన్యం ఉన్న ఇలాంటి క్యారెక్టర్స్ రేర్‌గా దొరుకుతాయి. పైగా కొంతకాలం తర్వాత ఇలాంటి క్యారెక్టర్ చెయ్యలేను. నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం అనిపించింది. అందులోనూ బాలకృష్ణగారికి కూతురిగా నటించడం నిజంగా చాలా సంతోషంగా అనిపించింది.
ఈ సినిమాలో నేను చేసిన మొదటి షాట్.. మీరు ట్రైలర్‌లో చూసిన ట్రైనింగ్ షాట్. పుష్‌అప్స్ చెయ్యాలి. కానీ, నేను చేయలేకపోతే బాలకృష్ణగారు పట్టుపట్టి చేయిస్తారు. షాట్ ఓకే అయిపోయిన తర్వాత నిజంగానే నీకు పుష్‌అప్స్ చేయడం రాదా అన్నారు. డైరెక్టర్ గారే అలా చేయమన్నారని చెప్పాను. నిజం చెప్పాలంటే బాలకృష్ణగారంటే నాకు కొంచెం భయం ఉంది. మొదటిసారి ఆయన్ని కలిసినపుడు ఆ భయం ఉంది. అయితే తర్వాతి క్షణంలోనే అది పోయింది. ఎందుకంటే ఆయన చాలా మంచి వారు పసిపిల్లాడి మనస్తత్వం. బాలకృష్ణ అనే పేరు ఆయనకి యాప్ట్ అని చెప్పాలి. ఆయనకి అపారమైన పరిజ్ఞానం ఉంది. సినిమా రంగంపైనే కాకుండా ఇతర రంగాలపై ఆయనకు చాలా గ్రిప్ ఉంది. నేను మెడిసన్ పరీక్ష రాసి వచ్చిన తర్వాత అందులోని చాప్టర్స్ గురించి ఎంతో డీప్‌గా మాట్లాడేవారు. మెడిసన్ చేయని ఈయనకి ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయని చాలా ఆశ్చర్యపోయాను’ అంటూ ‘భగవంత్ కేసరి’ చిత్రానికి సంబంధించి తన అనుభూతుల్ని తెలియజేసింది.