రీమేక్ సినిమాలు చేయడంలో డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) ది భిన్న శైలి. ఒరిజినల్ స్టోరీలైన్ ని మాత్రమే తీసుకొని.. దానిని తెలుగుకి తగ్గట్టుగా పూర్తిగా మార్పులు చేసి ఓ కొత్త సినిమాని చూస్తున్న అనుభూతిని కలిగిస్తాడు. అలాంటి హరీష్ శంకర్.. ఫహాద్ ఫాజిల్ నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘ఆవేశం’ని రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
హరీష్ శంకర్ దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఓ సినిమా చేయనున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. అయితే వీరి కాంబినేషన్ లో రానున్న సినిమా ‘ఆవేశం’ రీమేకే అని ఇండస్ట్రీ వర్గాల్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ‘ఆవేశం’ సినిమా చూసి తెలుగులో ఇది బాలయ్య చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఆ గెటప్ బాలయ్యకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. పైగా ఆయన యాక్షన్ కూడా అదరగొడతాడు. అలాంటి బాలయ్య ‘ఆవేశం’ సినిమా రీమేక్ చేస్తే.. దానికి హరీష్ శంకర్ డైరెక్టర్ అయితే.. ఇక ప్రాజెక్ట్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఏర్పడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ప్రస్తుతం బాలకృష్ణ తన 109వ సినిమాని బాబీ కొల్లి డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఆ తరువాత బోయపాటి శ్రీను ప్రాజెక్ట్ లైన్ లో ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక.. హరీష్ ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశముంది.