నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. బాలయ్య గత చిత్రాలు ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’ ఘన విజయాలను సాధించగా.. ఆయన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’ ఆ రెండు చిత్రాలను మించిన విజయం దిశగా దూసుకుపోతోంది.
బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ నిర్మించిన సినిమా ‘భగవంత్ కేసరి’. దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని.. భారీ వసూళ్ళతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. ప్రొడ్యూసర్ లెక్కల ప్రకారం ఈ సినిమా వారం రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.112 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఎనిమిది రోజుల్లో దాదాపు రూ.120 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. ఈ వీకెండ్ లో చెప్పుకోదగ్గ సినిమాల విడుదల లేకపోవడంతో.. ‘భగవంత్ కేసరి’ జోరుకి బ్రేక్ లు పడేలా లేవు. త్వరలోనే రూ.150 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరేలా ఉంది.
బాలయ్య కెరీర్ లో అత్యధిక వసూళ్ళు రాబట్టిన సినిమాలుగా ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’ నిలిచాయి. ఈ రెండు సినిమాలు కూడా రూ.130 కోట్ల రేంజ్ లో గ్రాస్ రాబట్టాయి. ప్రస్తుతం ‘భగవంత్ కేసరి’ జోరు చూస్తుంటే త్వరలోనే బాలయ్య కెరీర్ లో అత్యధిక వసూళ్ళు రాబట్టిన సినిమాగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.