జనగామ జిల్లా పేరు మార్చాలిజనగామకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాగా పేరు పెట్టాలని ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా అసెంబ్లీ ఆవరణలో మహాత్మాజ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, దీనిపై ఏప్రిల్ 11 లోపు ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయాలన్నారు. ఏ రాష్ట్రంలోనైనా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇచ్చుకునే సౌలభ్యం కల్పించాలని, తద్వారా జనాభా ఆధారంగా రిజర్వేషన్లు చేసుకోవచ్చని మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపాదించారని గుర్తు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం రిజర్వేషన్లు చేసుకునే అవకాశాన్ని రాష్ట్రాలకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. 2018 నుంచి ఇప్పటి వరకు 4,365 మంది సివిల్స్ కు ఎంపికైతే అందులో కేవలం 1,195 మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారని కవిత తెలిపారు. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఉన్నా కూడా కేవలం 15.5 శాతం మందిని మాత్రమే ఎంపిక చేశారన్నారు. ఎస్సీలు 5 శాతం, ఎస్టీలు కేవలం 3 శాతం మాత్రమే ఎంపికయ్యారన్నారు. కోల్పోతున్న రిజర్వేషన్లపై ఎవరూ మాట్లాడడం లేదని, కాబట్టి బీసీ మేధావులు ఈ అంశంపై గళమెత్తాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రౌండ్ టేబుల్ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, పార్టీ నాయకులు వి.ప్రకాశ్, సుందర్ రాజు యాదవ్, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రామచందర్ రావు, భారత జాగృతి రాష్ట్ర నాయకుడు దాస్యం విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Source link