సినీ పరిశ్రమలో హిట్ కాంబినేషన్ కి ఉండే క్రేజే వేరు. ఒక సినిమా హిట్ అయిందంటే ఆ కాంబినేషన్ లో సినిమా తీయడానికి మేకర్స్ ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు ‘బేబీ’తో బ్లాక్ బస్టర్ కొట్టిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ద్వయం మరోసారి చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా బేబీ. సాయి రాజేష్ దర్శకత్వంలో మాస్ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా 2023, జూలై 14న విడుదలై ఘన విజయం సాధించింది. రూ.8 కోట్ల లోపు థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ ఏకంగా రూ.40 కోట్లకు పైగా షేర్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో వైష్ణవి చైతన్యకి ఎంతో పేరు వచ్చింది. పలు అవకాశాలు ఆమెని వెతుక్కుంటూ వచ్చినట్లు తెలుస్తోంది. అందులో బడా బ్యానర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఆమె మరోసారి ఆనంద్ దేవరకొండతో జోడీ కట్టబోతున్నట్లు వినికిడి. బేబీ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఓ ప్రొడక్షన్ హౌస్ ఈ కాంబినేషన్ ని సెట్ చేసినట్లు న్యూస్ వినిపిస్తోంది. దసరాకు ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన రానుందని ఇన్ సైడ్ టాక్.