posted on Feb 3, 2024 10:37AM
కంటినిండా నిద్రపోతే చాలు.. అదే ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అని అందరూ అనుకుంటారు. కానీ కేవలం నిద్రపోవడమే కాదు.. ఎలా నిద్రపోతున్నాం అనేది కూడా ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. నిద్రపోయే భంగిమ మనిషి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని అంటారు. సాధారణంగా ఎడమవైపుకు తిరిగి నిద్రపోవడం ఆరోగ్యం అంటారు. ఇలా కాకుండా కుడివైపుకు తిరిగి పడుకోవడం అస్సలు మంచిది కాదని అంటారు. ఇవి రెండూ కాకుండా కొందరికి బోర్లా .. పొట్టను నేలకు ఆన్చి పడుకోవడం అలవాటుగా ఉంటుంది. అయితే ఇలా పొట్టను కిందుగా ఉంచి నిద్రపోవడం వల్ల భవిష్యత్తులో చాలా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు. అసలు బోర్లా.. పొట్టను కిందకు పెట్టి పడుకోవడం వల్ల కలిగే సమస్యలేంటి? తెలుసుకుంటే..
మానసిక ఆరోగ్యానికి ప్రశాంతమైన నిద్ర చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరి నిద్ర విధానం భిన్నంగా ఉంటుంది. కొంతమంది తమ వీపును నిటారుగా ఉంచి నిద్రించడానికి ఇష్టపడతారు. మరికొందరు ఒక వైపు తిరిగి నిద్రించడానికి ఇష్టపడతారు. కానీ మరికొందరు పొట్టను కిందకు వేసుకుని నిద్రపోతారు. ఇలా పడుకోవడం సౌకర్యంగానూ, మంచి నిద్రను ఇచ్చినప్పటికీ భవిష్యత్తులో ఇది హానికరం.
శరీర నొప్పి..
కడుపు కిందకు వేసుకుని నిద్రపోవడం వల్ల శరీర నొప్పుల సమస్య పెరుగుతుంది. ఇది మొదట్లో సౌకర్యంగా అనిపించినా, భవిష్యత్తులో సమస్యలు రావచ్చు. ఇలా నిద్రపోవడం వల్ల వెన్నెముకపై ఎక్కువ ఒత్తిడి ఏర్పడుతుంది, దీని కారణంగా వెన్నునొప్పికి గురవుతారు. ఇది కాకుండా మెడ నొప్పిని కూడా కలిగిస్తుంది.
వెన్నెముకకు మంచిది కాదు..
బోర్లా పడుకోవడం వల్ల వెన్నెముక మీద ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా భవిష్యత్తులో వెన్నెముకకు సంబంధించిన పెద్ద సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ భంగిమలో పడుకోవడం మానుకోవాలి.
రొమ్ము నొప్పి..
మహిళల్లో రొమ్ము నొప్పికి తరచుగా బోర్లా నిద్రపోవడమే కారణం. ఈ భంగిమలో రొమ్ములపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. రోజూ ఈ పద్ధతిలో నిద్రపోవడం వల్ల రొమ్ము నొప్పి ఫిర్యాదులు వస్తాయి.
జీర్ణక్రియ తగ్గుతుంది..
బోర్లా నిద్రపోవడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు. ఈ స్థితిలో జీర్ణక్రియ ప్రక్రియ సరిగ్గా పనిచేయదు. దీని కారణంగా కడుపు నొప్పి సమస్యలు వస్తాయి.
చర్మానికి హానికరం..
బోర్లా పడుకున్నప్పుడు ముఖం దిండుపై ఉంటుంది. దీని కారణంగా దిండులో ఉండే దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా ముఖానికి తగలడం వల్ల ముఖ చర్మానికి హాని కలిగుతుంది. ఇది మొటిమలు , చర్మ సంబంధ సమస్యలకు కారణమవుతుంది. ఇది మాత్రమే కాకుండా ఇలా నిద్రపోవడం వల్ల చర్మానికి తగినంత ఆక్సిజన్ అందదు. దాని వల్ల చర్మం మీద తొందరగా ముడతలు వస్తాయి.
నిద్రించడానికి మంచి భంగిమ ఏది?
నిద్రపోతున్నప్పుడు మెడ, వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోండి. మంచి నిద్ర కోసం మెత్తగా తేలికపాటి దిండ్లను ఉపయోగించాలి. మరీ ముఖ్యంగా ఎడమ వైపున నిద్రించడం వల్ల శరీరంలో రక్త ప్రసరణతో ఆరోగ్యకరంగా ఉంటుంది.
*నిశ్శబ్ద.